అతిలోకసుందరి శ్రీదేవి పలుసార్లు తన పెద్దకూతురు వ్యక్తిగత విషయాలలోనే కాదు.. కెరీర్ పరంగా కూడా తనపై ఎక్కువ ఆధారపడుతూ ఉంటుందని తెలిపింది. నిజానికి ఎవరు ఒప్పుకున్నా, లేకపోయినా కూడా శ్రీదేవి పెద్దకూతురు జాన్వికపూర్‌ని దక్షిణాది చిత్రాల ద్వారానే ఎంట్రీ చేయించాలని భావించి ఎందరో నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారన్నది వాస్తవం. ఆమె అక్కినేని అఖిల్ చిత్రం ద్వారా పరిచయం కానుందని, 'జగదేకవీరుడు-అతిలోకసుందరి' రీమేక్‌లో రామ్‌చరణ్‌తో నటించాలని ఉందని అశ్వనీదత్ కూడా చెప్పాడు. కానీ శ్రీదేవి మాత్రం తన కూతురి ఎంట్రీ కేవలం బాలీవుడ్ చిత్రం ద్వారా, అందునా కరణ్‌జోహార్ చేతుల మీదుగానే జరగాలని భావించింది. అలా ఆమె మరాఠీలో సంచలన విజయం సాధించిన 'సైరత్'కి రీమేక్‌గా రూపొందిన 'ధడక్' చిత్రం ద్వారా పరిచయం అయింది. ఈ చిత్రం మరాఠా స్థాయిలో మాత్రం విజయం సాధించలేకపోయింది. 'ధడక్' చిత్రం విడుదలైన తర్వాత జాన్వి మాట్లాడుతూ, తన రెండో చిత్రం మాత్రం రీమేక్ కాకుండా ఉండాలని తన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారని చెప్పుకొచ్చింది.
ఇక తల్లి మీద ఎక్కువగా ఆధారపడిన జాన్వికి ఇప్పుడు బోనీకపూర్, ఖుషీతో పాటు బోనీ మొదటి భార్య పిల్లల అండదండలు కూడా లభిస్తున్నాయి. ఇలాంటి దశలో ఆమె తన కుటుంబసభ్యుల సలహా మేరకు త్వరలోనే దక్షిణాది ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అది కూడా ప్రస్తుతం తెలుగులోనే కాక దక్షిణాదిలో కూడా సెన్సేషనల్ స్టార్‌గా దూసుకెళ్తున్న విజయ్‌దేవరకొండ సరసన అని తెలుస్తోంది. 'అర్జున్‌రెడ్డి, గీతగోవిందం'లతో తన నటనలోనే కాదు.. తన యూటిట్యూడ్‌తో, చిత్రాల ఎంపికలో కూడా జాగ్రత్తలు పాటిస్తోన్న అర్జున్‌రెడ్డి మీద ప్రస్తుతం తెలుగు, తమిళ భాషా ప్రేక్షకులే కాదు.. బాలీవుడ్ వారు కూడా ఓ కన్నేసి ఉన్నారు. ఈ చిత్రం సాధించిన సంచలన విజయం చూసి మాత్రమే కాదు.. 'అర్జున్‌రెడ్డి'కి రీమేక్‌లుగా రూపొందుతున్న చియాన్ విక్రమ్ కుమారుడు దృవ్ పరిచయం అవుతూ, బాల దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ 'వర్మ' టీజర్, ఫస్ట్‌లుక్‌లో కూడా తమిళ తంబీలు కూడా విజయ్ లుక్‌తో, దృవ్ లుక్‌ని పోలుస్తూ ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ వారు కూడా ఇదే పనిలో ఉన్నారు. అక్టోబర్ 5న విడుదల కానున్న 'నోటా' చిత్రం తెలుగు, తమిళంలో కూడా విడుదల కానుంది. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తే విజయ్‌కి ఇక తిరుగుండదనే భావించాలి. ఇలాంటి స్థితిలో విజయ్ సరసన మొదటి చిత్రం జాన్వికపూర్ చేయనుందనే వార్తే నిజమైతే ఆమె మంచి నిర్ణయం తీసుకున్నట్లుగానే భావించాలి.
ఇదే విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ బాలా తెలుపుతూ, ప్రస్తుతం తమిళంకి చెందిన ఇద్దరు దర్శకులు, ఓ తెలుగు దర్శకుడు జాన్వితో సంప్రదింపులు జరుపుతున్నారని, ఈమె విజయ్ దేవరకొండ సరసన తొలి దక్షిణాది చిత్రంలో నటించే అవకాశం ఉందని చెప్పాడు. 'నోటా' విజయవంతం అయిన పక్షంలో తమిళంలో కూడా విజయ్‌కి క్రేజ్ రావడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో బహుభాషల్లో క్రేజ్ ఉన్న విజయ్ సరసన జాన్వి నటిస్తే ఆ చిత్రం కూడా సంచలనాలకు కేంద్రబిందువు కావడం ఖాయమనే చెప్పాలి.