పాత విషయాలను మర్చిపోతున్న వారి గొప్పతనాన్ని గుర్తు చేస్తూ పరుచూరి గోపాలకృష్ణ నిజంగా సినీ పరిశ్రమకు సేవ చేస్తున్నాడనే చెప్పాలి. రచయితలుగా తమకు జరిగిన సంఘటనలు, జ్ఞాపకాలను ఆయన నిర్భయంగా బయటపెడూతూ, నేటితరానికి మార్గదర్శకంగా మారుతున్నారు. తాజాగా ఆయన దర్శకుడు ఎ.మోహనగాంధీ గొప్పతనం గురించి వివరించాడు.
‘‘మోహనగాంధీ దర్శకత్వం వహించిన ‘కర్తవ్యం, టెర్రర్, ఆశయం, ఆడపడుచు’ వంటి చిత్రాలకు మేము పనిచేయడం మా అదృష్టమనే చెప్పాలి. మోహనగాంధీ గారు సామాజిక సమస్యలను చిత్రాలుగా తీయడంలోనే కాదు... ఆయన పాటలను కూడా అద్భుతంగా తీయగలరు. ఆయన తీసిన పాటలను చూస్తే కె.రాఘవేంద్రరావు గారు తీశారా? అనేంత గొప్పగా ఉంటాయి. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా మోహనగాంధీతో చిత్రాలు తీయడానికి సిద్దంగా ఉండేవారు. కానీ ఆయన తన కెరీర్ మొత్తం చిన్న బడ్జెట్ చిత్రాలు తీయడానికే ఆసక్తి చూపించేవారు. అలా ఆయన శివకృష్ణ హీరోగా తీసిన ‘ఆడపడుచు’ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది.
ఆ చిత్రాన్ని చూసిన చిరంజీవి గారు తనకి అలాంటి చిత్రాలు చేయాలని ఉందని, అలాంటి కథలు తనకి కూడా కావాలని అన్నారు. అంతేకాదు.. ఈ కథ తనకి వచ్చిఉంటే బాగుండేదని ప్రశంసించారు. కథ ఇచ్చేసిన తర్వాత మాకు కూడా అలాగే అనిపించింది. ఆకథ పెద్ద హీరోలకు కూడా బాగా వర్కౌట్ అయ్యేదని మాకు అనిపించింది..’’ అని చెప్పుకొచ్చారు.