ప్రస్తుతం తెలుగులో ఉన్న కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్‌ది ప్రత్యేకశైలి. వెస్ట్రన్, ఫోక్ ఏదైనా సరే తనదైన స్టైల్‌లో ఈయన స్టార్స్ చేత వారికి నప్పే విధమైన స్టెప్స్‌ని కంపోజ్ చేస్తాడు. అభిమానుల చేత థియేటర్లలో రచ్చరచ్చ చేయిస్తాడు. 2009లో వచ్చిన నితిన్ చిత్రం ‘ద్రోణ’తో కెరీర్ ప్రారంభించిన ఆయన రామ్‌చరణ్ ‘రచ్చ’తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ‘జులాయి, నాయక్, బాద్‌షా, అత్తారింటికి దారేది, ఇద్దరమ్మాయిలతో, ఎవడు, రేసుగుర్రం, గోవిందుడు అందరి వాడేలే, టెంపర్, సన్నాఫ్ సత్యమూర్తి, బాహుబలి, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ఖైదీనెంబర్ 150, రంగస్థలం’ వంటి పలుహిట్ చిత్రాలకు పనిచేశాడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లకు కూడా పలు చిత్రాలకు పనిచేసిన ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రంలోని బ్యాలెన్స్ ఉన్న పాటకు తాజాగా నృత్యాలను సమకూర్చాడు.
ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్న ఒకే ఒక పాట చిత్రీకరణను తాజాగా జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో పూర్తి చేశారు. గతంలో ఎన్టీఆర్‌కి ఆయన కంపోజ్ చేసిన పాటలు అద్భుతమైన రెస్పాన్స్‌ని సొంతం చేసుకోవడంతో ఈ పాటపై కూడా భారీ అంచనాలు మొదలయ్యాయి. కొంత గ్యాప్ తర్వాత ఆయన త్రివిక్రమ్ -ఎన్టీఆర్‌ల చిత్రానికి పనిచేయడం గమనార్హం. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ, చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ గార్లతో పనిచేశాను. ఎన్టీఆర్‌కి నేను కంపోజ్ చేసిన సాంగ్ అద్భుతంగా వచ్చింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లు ఎంతో సంతృప్తి వ్యక్తం చేయడం ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది. మీ అందరికంటే ఈ చిత్రం విడుదల కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేశాడు.
ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్‌తో తీసుకున్న ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ డేట్‌ని ప్రకటించనున్నారు. మొత్తం నాలుగు పాటలున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న విజయదశమి కానుకగా విడుదల చేయనున్నారు.