పవన్‌కళ్యాణ్.. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఈయన వ్యక్తిత్వం, సిద్దాంతాల ద్వారా తన అభిమానులనే కాదు.. తటస్థప్రజలను, కాస్త ఆలోచనాపరులలో చిన్న ఆశ రేకెత్తించాడు. దీంతో చాలా మంది ఏపీకి మరో కేజ్రీవాల్ లభిస్తాడని ఆశపడ్డారు. మొదట్లో రాష్ట్ర విభజన నుంచి ప్రత్యేకహోదా వరకు ఆయన మాటల్లో ఆవేశమే కాదు కొన్ని మంచి భావాలు కూడా బయటకు వచ్చాయి. కాపు రిజర్వేషన్ల విషయంలో మౌనం పాటించాడు. ప్రతిది ప్రజలందరికీ సమానంగా దక్కాలని, కానీ నేడు సమాజంలో బలహీనులు బలవంతుల కారణంగా అణగదొక్కబడుతున్నారని, చట్టాలు కూడా బలవంతులపై బలహీనంగా, బలహీనులపై బలంగా పనిచేస్తున్నాయనే వాదనతో ఎందరో ఏకీభవించారు. ఒకనొక సమయంలో దళితులు, ఇతర వెనుకబడిన వారికి రిజర్వేషన్లు సరైన పరిష్కారం కాదని, దానికి ప్రత్యామ్నాయాలు చూడాల్సిఉందని చెప్పిన మాట ఎందరో మనసులలలోనే మార్మోగింది.
అంతేకాదు... నేను ప్రతి విషయాన్ని రాజకీయం చేయను. ఆ విధంగా నేను ప్రభుత్వాల పనికి అడ్డుతగలను అని చెప్పాడు. కానీ రాను రాను ఆయన కూడా ఓ సాధారణ రాజకీయ నాయకునిగానే మారుతున్నాడు. తాను అధికారంలోకి వస్తే బిసిలకు అవకాశాన్ని బట్టి మరో 5శాతం పెంచుతానని, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని, ముస్లింలకు, మైనార్టీలకు అది చేస్తానని ఇది చేస్తానని చెబుతున్నాడు. పైగా రేషన్ బదులు మహిళల ఖాతాల్లో 2500 నుంచి 3000 వేస్తానని హామీ ఇస్తున్నాడు. ఇవన్నీ పాత సారాను కొత్త సీసాలో పోసినట్టుగానే కనిపిస్తున్నాయి. నేటి రోజుల్లో మేధావులు మాత్రం రిజర్వేషన్లు అనేవి ఇన్నేళ్ల స్వతంత్రభారతావనిలో ఫెయిల్యూర్‌గా మిగిలాయని, అవి మారుమూల తండాలలో నివసిస్తూ.. రోజు చచ్చిబతుకుతున్న గిరిజనులు, కేవలం 100 రూపాయల కూలీకోసం గాలి జనార్థన్‌రెడ్డి నుంచి బడా బడా వారి కోసం మైనింగ్ ఏరియాలలో, డబ్బున్న వారి మోసాలకు బలవుతూ ఏజెన్సీలలో గంజాయి వనాలు పండిస్తూ బతుకుతున్న వారి కోసమే. వీరికి నిజంగా రిజర్వేషన్లు, తమకి ఇన్ని సదుపాయాలు ఉన్నాయని కూడా తెలియదు. రిజర్వేషన్లు అనేవి కేవలం కొన్ని కుటుంబాల హస్తగతంలో ఉండిపోతున్నాయి. ఇక మహిళలకు ఆత్మరక్షణే కరువవుతూ, రోజుకో మైనర్ బాలికపై అఘాయిత్యాలు జరుగుతున్న ఈ రోజుల్లో మహిళా సాధికారత అనేది మహిళా రిజర్వేషన్ల ద్వారానే వస్తుందని పవన్ నమ్ముతున్నట్లు ఉన్నాడు.
కానీ మహిళల రిజర్వేషన్లు ఉన్నచోట ఎన్నికల్లో నిలబడి గెలిచేది మహిళలే గానీ పెత్తనం మాత్రం భర్తలు, కుమారులు, అల్లుళ్లదే అనే సత్యాన్ని ఆయన కూడా మర్చిపోతున్నాడు. మరో బాధాకరమైన సంఘటన ఏమిటంటే.. నాయకుడు మంచి వాడైనంత మాత్రాన దేశం బాగుపడదు. వెనుక ఉండే సైన్యం కూడా అలాంటి ఉత్తమ భావాలతోనే ఉండాలి. కానీ ప్రతి చోటా జనసైనికుల రూపంలో పవన్ వీరాభిమానులు, పవన్‌ని ఏమైనా విమర్శిస్తే నరుకుతాం.. చంపుతాం అంటున్నవారే ఉండటం బాధాకరం. ఇక నెల్లూరు జిల్లాకే వస్తే జనసేనాధిపతి పిలిచి మరీ పార్టీలో చేర్చుకున్న సీనియర్ నాయకుడు మాదాసు గంగాధరం అంటే ఏమిటో నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్క వ్యక్తి వాస్తవాలు చెబుతాడు. అలాంటి వ్యక్తిని తన పక్కన పెట్టుకున్న పవన్ కనీసం తన సినిమా రిపోర్ట్ విషయంలో చేసే చిన్నస్థాయి సర్వే చేసినా కూడా మాదాసు గంగాధరంవంటి వారిని పార్టీలో చేర్చుకుని ఉండడు.
ఇక పవన్ నెల్లూరుకు వెళ్లిన సందర్భంగా తేళ్ల రాఘవయ్య, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి వంటి వారికి పెద్దపీట వేశాడు. తేళ్లరాఘవయ్య చివరకు ఏపీలో ఎక్కడా చోటులేని శరద్‌పవర్ ఎన్‌సీపీ పార్టీ నుంచి ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. ఇక మరో వ్యక్తి అయిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఒకప్పుడు ఆనం వివేకాకు బ్రోకర్‌గా, ప్రస్తుతం వైసీపీతరపున రాజ్యసభ సభ్యుడు, బడా పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అదే పని చేస్తూ ఉంటాడు. ఇతను పక్కా వైసీపీ కోవర్టు. ఈ విషయాలు నెల్లూరులో ఎవరిని అడిగినా క్షుణ్ణంగా చెబుతారు. మరి ఇలాంటి వారిని పెట్టుకుని పవన్ రాష్ట్రాన్నిఏమి ఉద్దరిస్తాడు?
ఇక బండ్ల గణేష్ వంటి వ్యక్తి పవన్ దగ్గరకు రాకపోవడం నిజంగా పవన్ నెత్తి మీద పాలు పోయడమే. కాంగ్రెస్‌లో చేరుతూ ఆయన ‘సినిమాలు వేరు.. రాజకీయలు వేరు’ అని చెప్పుకొచ్చాడు.. ఇతను ఇండస్ట్రీలో ఏమిటి అనేది అందరికీ తెలుసు. ఇక పవన్ కూడా ఈసారి నాగబాబుకి కాకినాడ ఎంపీ సీటు ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగ సందర్బంగా పవన్‌తో అలీ వచ్చాడని ప్రచారం జరగడంలో కొంత మాత్రమే వాస్తవం ఉంది. ఎందుకంటే అలీ.. రొట్టెల పండుగకు, నెల్లూరు పక్కనే ఉన్న కసుమూరు దర్గాకి ప్రతిఏడాది వస్తూ ఉంటాడు. కాబట్టి పవన్ కోసం అతను వచ్చాడని చెప్పడం సరికాదు. ఇక అలీ.. జనసేనలో చేరుతున్నాడని ప్రచారం మొదలైంది.
ఇప్పటివరకు పవన్ విషయంలోనే కాదు.. నిజజీవితంలో కూడా నిజాయితీగా కష్టపడి పైకివచ్చి, అందరినీ నవ్విస్తూ, పదిమందికి చేతనైన సాయం చేస్తూ వస్తోన్న మంచి వ్యక్తి అలీ మాత్రమే. ఏదో సినీకార్యక్రమాలలో కాస్త వెగటు పుట్టించే జోకులు వేస్తాడనేగానీ అలీ స్వతహాగా ఎంతో మంచివాడు. కానీ ఆయనకు ఇప్పటికే సీటు ఇవ్వడానికి మురళీమోహన్.. చంద్రబాబుతో కలిసి చర్చలు జరుపుతున్నాడు. మరి అలీకి టిడిపి సీటు ఇవ్వడానికి సుముఖంగా ఉంటే అలీ టిడిపిని కాదని జనసేనలోకి వస్తాడా? అన్నదే ప్రశ్న. ఎందుకంటే ఇతను ‘అధ్యక్షా’ అని పిలవడమే తన జీవితలక్ష్యమని చెప్పుకునే బండ్ల గణేష్ వంటి వ్యక్తి మాత్రంకానేకాదు. ఇలాంటివన్నీ పవన్ గమనిస్తే మంచిదంటూ నెల్లూరుకు చెందిన కొందరు రాజకీయవేత్తలు చెబుతుండటం విశేషం.