ఈమద్య హాలీవుడ్‌లో మొదలైన కాస్టింగ్‌కౌచ్‌కి సంబంధించిన ‘మీ టూ’ ఉద్యమం బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లకుకూడా బాగా పాకి సంచలనాలు, ప్రకంపనలు సృష్టించింది. అయితే హాలీవుడ్ కంటే ఎన్నో ఏళ్ల ముందుగానే రాధికాఆప్టే నుంచి మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపులు వంటి ఘటనలు ముందుగా బయటకి వచ్చాయి. తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరభద్ర’లో నటించిన ఉత్తరాది భామ తనుశ్రీదత్తా ఇప్పుడు అదే విషయం వాదిస్తోంది. ఆషిక్ బనాయా ఆప్నేతో తెరంగేట్రం చేసి.. ‘చాకోలేట్, రఖీబ్, ధోల్, రిస్క్, గుడ్ బోయ్ బ్యాడ్ బోయ్’ చిత్రాలలో ఈమె నటించింది. 2010లో వచ్చిన ‘అపార్ట్‌మెంట్’ తర్వాత ఈమెకి మరలా అవకాశాలు రాలేదు.
దానిపై ఆమె మాట్లాడుతూ, 2008లో ఓ నటుడు నాతో అసభ్యంగా బిహేవ్ చేశాడు. హాలీవుడ్ మీటూ ఉద్యమం రెండేళ్ల కిందట ప్రారంభమై ఉంటుంది. కానీ నేను భారత్‌లో దీనిని చాలా ఏళ్లకిందటే ప్రారంభించాను. ఇక్కడ తొలిసారి కాస్టింగ్‌కౌచ్‌పై మాట్లాడింది.. ఉద్యమం ప్రారంభించింది నేనే. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రం షూటింగ్ సమయంలో ఓ సాంగ్ సమయంలో సహనటుడు నాచేతులు తాకుతూ, కొరియోగ్రాఫర్లను పక్కకి వెళ్లమని, తానే డ్యాన్స్ నేర్పిస్తానని నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై అప్పుడే మీడియా ముందుకు వచ్చాను. దీనిపై మూడు రోజుల జాతీయ మీడియాలో చర్చ జరిగింది. వీటిని చూసిన ఓ బాలీవుడ్ ప్రముఖుడు స్పందించలేదు.
అలా మీడియా ముందుకు వచ్చినందుకు నాకు మరలా ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. నా కెరీర్‌లో అది ఇప్పటికే పెద్ద గాయమే. కానీ దానిని మనవారు మరిచిపోయారు. ఇప్పుడు ఏదో హాలీవుడ్ నుంచి ఇది బయటికి వచ్చింది అంటున్నారు గానీ నటీమణుల కోసం మొదట గళం విప్పిన నన్ను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.. అని ఆవేదన వ్యక్తం చేసింది.