నేడు ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించడంలో టైటిల్స్ కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. టైటిల్స్ పెట్టడంలో ఇప్పుడు మూడు నాలుగు రకాల ట్రెండ్స్ నడుస్తున్నాయి. బాగా హిట్టయిన సాంగ్‌లోని పదాలను టైటిల్‌గా పెట్టడం ఒక పద్దతి. ఇలాంటి చిత్రాలే ‘నన్నుదోచుకొందువటే.. హలో గురు ప్రేమకోసమే’.. వంటివి. రెండో రకం సినిమాలోని హీరో పేరునే టైటిల్‌గా పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడం. ఈ తరహా ప్రయత్నాన్ని రామ్‌చరణ్ ‘ధృవ’ చిత్రంతో ఫాలో అయ్యాడు. మూడోది వైవిధ్యమైన టైటిల్‌ని పెట్టి ఆసక్తిని రేపడం. ఈ పద్దతిలో చరణ్ చేసిన ‘రంగస్థలం’ బాగా సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు మరో పద్దతిని రామ్‌చరణ్ తన తదుపరి చిత్రం ద్వారా ఫాలో కాబోతున్నాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
నేడు మెగాస్టార్ పాటలను, టైటిల్స్‌ని ఆయన కుమారుడు రామ్‌చరణ్ కంటే సాయిధరమ్‌తేజ్ వంటి వారే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కానీ తండ్రి సినిమా టైటిల్‌ని తనయుడికి పెడితే వచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. ఆ ప్రయత్నమే బోయపాటి శ్రీను-దానయ్యలు చేయబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది. చిరంజీవి మెగాస్టార్‌గా మారుతున్న తరుణంలో బి.గోపాల్ దర్శకత్వంలో టి.సుబ్బరామి రెడ్డి నిర్మించిన భారీ చిత్రం ‘స్టేట్ రౌడీ’. ఈ చిత్రం విడుదలకు ముందు సృష్టించిన ప్రకంపనలు అన్ని ఇన్ని కావు. కానీ సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఎబౌయావరేజ్ ఫలితాన్నే రాబట్టింది. కానీ ఈ టైటిల్‌కి ఉన్న పవర్ మాత్రం నాడు అందరినీ ఉర్రూతలూగించింది. కానీ అదే టైటిల్‌తో ఆమధ్య శివాజీ హీరోగా మరో చిత్రం కూడా వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కైరా అద్వానీ, వివేక్ ఒబేరాయ్ వంటి వారు నటిస్తున్న చిత్రానికి కూడా ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్ పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్, వివేక్‌ఒబేరాయ్‌ల మీద పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. వివేక్ తాజాగా తన పార్ట్ షూటింగ్‌ని పూర్తి చేసుకుని ఇండియా వచ్చేశాడు. కాగా ఈ చిత్రంఫస్ట్‌లుక్ , టైటిల్స్‌ని విజయదశమి కానుకగా విడుదల చేసి చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతలోనే ఉత్సాహం ఆపుకోలేని ఫ్యాన్స్ తమ సొంత ప్రతిభతో ఫ్యాన్‌మేడ్ పోస్టర్స్‌ని సోషల్‌మీడియాలో పెట్టి హంగామా చేస్తున్నారు. బి.గోపాల్ తర్వాత హీరోయిజాన్ని అంతలా ఎలివేట్ చేసే దమ్మున్న బోయపాటి శ్రీను అదే టైటిల్‌ని పెడితే మాత్రం రచ్చ రచ్చ ఖాయమనే చెప్పాలి...!