ఒకప్పుడు తమిళ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజుండేది. కేవలం ప్రేక్షకుల్లోనే కాదు.. ట్రేడ్ లోను మణిరత్నం చిత్రాలకు మంచి డిమాండ్ ఉండేది. మణిరత్నం సినిమాలకు యూత్ ప్రేక్షకులు ఎక్కువగా ఉండేవారు. స్టార్ హీరోలను అభిమానించే అభిమానులు ఉన్న కాలంలో ఒక డైరెక్టర్ ని అభిమానించే అభిమానులు కూడా ఉంటారనేది మణిరత్నం విషయంలోనే జరిగింది. ఇక చాలామంది హీరోలకు మణిరత్నంతో పనిచేయాలనే కోరిక మాత్రం బాగా ఉండేది. కానీ మణిరత్నం ఈ మధ్యన తన ఫామ్ ని కోల్పోయాడు. ఓకె బంగారంతో కాస్త కుదురుకున్నప్పటికీ.. చెలియా సినిమా ప్లాప్ తో మళ్ళీ ఆయన మరో సినిమా తెరకెక్కించడానికి చాలా టైం తీసుకునేలా చేసింది.
పెద్దగా క్రేజ్ లో లేని హీరోలైన అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి , శింబు లతో నవాబ్ అనే మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాకి మెయిన్ అండ్ అదనపు ఆకర్షణ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ తప్ప ఈ సినిమాకి పెద్దగా అంచనాలు లేవు. అయితే మణిరత్నం సినిమాకి అంచనాలు లేవు అని అనుకోవడం పొరబాటు అని తమిళ బుక్ మై షో చూస్తే తెలుస్తుంది. రేపు గురువారం విడుదల కాబోతున్న నవాబ్ సినిమా కి తమిళంలో ఎంత క్రేజుందంటే... ప్రీమియర్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలకు అడ్వాన్స్‌లో టికెట్స్ సేల్ అయిపోతూ వుండడం చూసి ట్రేడ్ పండితులు కూడా అవాక్కవుతున్నారు అంటే తమిళంలో మణి సినిమా క్రేజుకి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. మరి ఈ క్రేజ్ కేవలం మణిరత్నం వలెనే అంటున్నారు. ఎందుకంటే అరవింద స్వామి, శింబు, విజయ్ లు పెద్దగా ఫెమ్ లో లేకపోవడం వలనే ఈ సినిమాకి క్రేజొచ్చింది మణి వలనే అంటున్నారు.
సోదరుల మధ్య జరిగే ఆధిపత్య పోరుని కథాంశంగా ఎంచుకుని తెరకెక్కించిన ఈసినిమా కి అసలు ఓపెనింగ్స్ వస్తాయా అనే అనుమానం చాలామందే వ్యక్తం చేశారు. మరి మణిరత్నం గత సినిమాల ప్రభావం ఈ నవాబ్ మీద పడలేదంటే మణిరత్నం దమ్ము ఇంకా తగ్గలేదనేది మాత్రం రుజువవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులోనూ డబ్ అవుతుండగా... దేవదాస్ సినిమా తో ఈ సినిమా పోటీ పడుతుంది. నాని - నాగార్జున కాంబోలో వస్తున్నా దేవదాస్ మీద తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే తమిళనాట నవాబ్ కి ఉన్న ప్రమోషన్ తెలుగులో లేకపోవడం తో తెలుగు ప్రేక్షకులకు నవాబ్ అంతగా చేరువయ్యేలా కనబడ్డం లేదు. చూద్దాం రేపు ఈపాటికల్లా మణిరత్నం నవాబ్ కెపాసిటీ ఏమిటనేది తెలుస్తుంది.