ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో లాంగ్ కెరీర్‌ని కొనసాగిస్తూ, ట్రెండ్‌లు, ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నా కూడా వాటిని ఒడిసి పట్టుకుని ఇటు పెద్ద స్టార్స్‌తో భారీ చిత్రాలనే కాకుండా యంగ్ బ్లడ్ అయిన బన్నీ వాస్ వారికి పగ్గాలు అప్పగించి గీతాఆర్ట్స్2 బేనర్‌లో కూడా యంగ్ హీరోలతో పెద్ద విజయాలు సాధిస్తున్న ఏకైక నిర్మాత అల్లుఅరవింద్. మెగా ఫ్యామిలీలోనే ఇంకా చెప్పాలంటే తన తనయుడు కూడా స్టార్ అయినా కూడా కథలను ఎంచుకోవడం, దర్శకుల ప్రతిభను ఐడెంటిఫై చేయడం, కథకు తగ్గ బయటి హీరోలను కూడా తీసుకుని విజయపథంలో దూసుకెళ్తున్న జీనియస్ ప్రొడ్యూసర్ గీతాఆర్ట్స్ అధినేత అల్లుఅరవింద్.
ఇక తాజాగా ఆయన గీతాఆర్ట్స్2 బేనర్ ద్వారా 'గీత గోవిందం' వంటి బ్లాక్‌బస్టర్‌ని సొంతం చేసుకున్నాడు. 10కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం భారీ లాభాలను తెస్తూ 100కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక నేటి రోజుల్లో ఏదైనా చిత్రం పెద్ద హిట్ అయితే నిర్మాతలు హీరోలకు, దర్శకులకు గిఫ్ట్‌లు ఇస్తున్నారు. హీరోలు కూడా దర్శకులకు బహుమతులు ఇస్తున్నారు.
కానీ అల్లు అరవింద్ మాత్రం ఏదో 20,30లక్షలు చేసే బహుమతిని కాకుండా ఏకంగా లాభాలలో 10కోట్లను దర్శకుడు పరుశురాంకి ఇవ్వడమే కాదు.. మరో చిత్రానికి అవకాశం కూడా ఇచ్చాడు. ఇలా అల్లుఅరవింద్ నేడు కొత్త ట్రెండ్‌కి, దర్శకుల ప్రతిభను గుర్తిస్తూ ఇలా ఇవ్వడం అనేది శుభపరిణామం అనే చెప్పాలి.