సమంత.. అక్కినేని కోడలు అయినాక నటిగా కూడా ఈమె జాతకం తిరిగింది. హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత ప్రేక్షకులు ఆదరించరనే వ్యాఖ్యలను ఈమె తప్పని నిరూపించింది. వివాహం తర్వాత ఈమె నటించిన 'రాజుగారి గది 2' చిత్రం ఫలితాన్ని పక్కన పెడితే నటిగా సమంతకు ఈ చిత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అంటే ఈ ఏడాది ఆమె నటించిన 'రంగస్థలం, మహానటి, యూటర్న్' చిత్రాలు కూడా ఈమెకి ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టాయి. పెళ్లయ్యే వరకు ఎక్కువగా గ్లామర్‌డాల్ వంటి సాధారణ హీరోయిన్ పోషించిన పాత్రలే ఈమె కూడా చేసింది. కానీ పెళ్లయిన తర్వాత మాత్రం తన రూట్ మార్చింది. అలాగని ఈమె గ్లామర్‌ని పూర్తిగా పక్కన పెట్టలేదు. గ్లామర్‌గా కనిపిస్తూనే మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఒడిసిపట్టుకుంది. 'రంగస్థలం' చిత్రంలో అందరు డీగ్లామర్ పాత్ర అనుకుంటారు గానీ పల్లెటూరి యువతిగా ఈమె యువతరం మతులను పోగొట్టింది.
ఇక ఈమె తెలుగులోనే కాదు.. ఈ ఏడాది తమిళంలో కూడా తన సత్తా చాటింది. విశాల్‌తో నటించిన 'ఇరుంబుదిరై' తమిళంలోనే కాదు.. తెలుగులో 'అభిమన్యుడు' గా వచ్చి మంచి రెస్సాన్స్‌ని సాధించింది. ఇక ఈనెల 13న ఆమె కోలీవుడ్‌లో శివకార్తికేయన్‌తో నటించిన 'సీమరాజా' కూడా ఓకే అనిపించింది. ఇందులో ఎక్కువ క్రెడిట్ శివకార్తియేయన్‌కి దక్కినా కూడా సమంత పాత్ర కూడా ప్రేక్షకులను అలరించింది. మీడియా మొత్తం దాదాపు ఈ చిత్రానికి 2.5 వరకు రేటింగ్స్ ఇవ్వడం గమనార్హం. ఇక ఈ ఏడాది తాను నటించిన చిత్రాలన్నీ విడుదలై పోయి ఆమెని సంతోషపెట్టాయి. 'యూటర్న్' ఆర్ధిక పరిస్థితి పక్కన పెడితే మంచి టాక్ వచ్చింది. దీంతో ఈమె కాస్త రెస్ట్ అండ్ అకేషన్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. అదేనండీ ఈమె ఇప్పుడు విహార యాత్రకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కి 'ఫైనల్లీ వేకేషన్' అంటూ తెలిపింది.
తన తర్వాతి చిత్రాన్ని ఈమె తన భర్త నాగచైతన్యతో కలిసి శివనిర్వాణ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకుంది. ఈ చిత్రం చైతూ-సామ్‌ల పెళ్లిరోజైన అక్టోబర్ 6వ తేదీన ప్రారంభం కానుంది. సో.. ఈ చిన్నగ్యాప్‌ని కూడా సమంత బాగా సద్వినియోగం చేసుకుంది. బహుశా ఈ ఏడాది ఆమె నటించిన 'సీమరాజా' చిత్రం డబ్బింగ్ వెర్షన్ అయినా తెలుగులో విడుదల అవుతుందో, లేదో వేచిచూడాలి. మరోవైపు ఆమెకి బాలీవుడ్‌లో హిట్ అయిన 'స్త్రీ' చిత్రంలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రం చేస్తుందా? లేదా? అనే విషయంపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇదే చిత్రాన్ని ఆమె ఓకే చేస్తే నాగచైతన్యతో కలిసి చేయబోయే తర్వాతి చిత్రం ఇదే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.