నందమూరి బాలకృష్ణ. ఈ వయసులో కూడా ఆయన నటించాలని ఏదో కొత్తగా చేయాలనే తపన ఎంతో మెచ్చుకోదగింది. ఆయన చిరంజీవితో పోల్చుకుంటే పెద్ద డ్యాన్సర్ కానప్పటికీ తన వంతు కష్టపడతాడు. ‘జైసింహా’ సినిమా చూసిన వారెవరికైనా బాలయ్య తపన చూస్తే ముచ్చటేస్తుంది. ఇక ఈయన ఎంచుకునే కథలు, దర్శకులు, ఆయన చేసే కొన్ని చిత్రాలు చూస్తే మాత్రం నవ్వు వస్తుంది. ఇక బాలయ్యలో పలు విభిన్న పాత్రలు చేయాలనే తపన ఉంది. ‘ఆదిత్య369, భైరవద్వీపం, పాండురంగడు, శ్రీకృష్ణార్జున విజయం, శ్రీరామరాజ్యం, గౌతమీ పుత్రశాతకర్ణి’ .. ప్రస్తుతం తన తండ్రి బయోపిక్ ఎన్టీఆర్ వంటివి ఆయన అభిరుచిని తెలియజేస్తాయి.
ఇక ఈయన తన తండ్రి నుంచి ఎన్నో మంచి లక్షణాలను నేర్చుకున్నారు. కష్టపడే తత్వం, క్రమశిక్షణ వంటివి ఆయనకు పర్యాయపదాలు. ఇక విషయానికి వస్తే ఈయన తండ్రి ఎన్టీఆర్ తాను హీరోగా వెలిగిపోతున్న రోజుల్లో కూడా ఎన్నో పౌరాణిక చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలైన ‘ధుర్యోధనుడు, రావణాసురుడు, కర్ణుడు, భీష్మ’ వంటి పాత్రలు చేశాడు. అంతటి గట్స్ ఉన్ననటుడు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ పోషించిన పాత్రలను విలన్ పాత్రలు అని మాత్రం అనకూడదు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, లేక ప్రతినాయక పాత్రలనే సంబోధించాలి. ఇక అద్భుమైన మాస్ ఫాలోయింగ్, 100 చిత్రాలు పూర్తి చేసిన బాలయ్య.. తాజాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి గాను బాలయ్య సైమా వేడుకల్లో సందడి చేసి రెడ్ కార్పేట్ గౌరవం అందుకుని ఉత్తమ నటునిగా క్రిటిక్స్ విభాగంలో అవార్డును అందుకున్నాడు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘‘నేను విలన్ పాత్రలు, ప్రతినాయక పాత్రలైనా చేయడానికి రెడీగా ఉన్నాను. అయితే ప్రతినాయక పాత్రలు పోషిస్తే నా అభిమానులు నాపై పోలీసు కేసులో పెడతారేమో’’ అంటూ దుబాయ్ వేడుకగా చెప్పాడు. నాటి రోజుల్లోనే కాదు.. నేటితరంలో కూడా ఎందరో నటీనటులకు అన్ని తరహా పాత్రలు చేయాలని ఉంటుంది. కానీ అభిమానులే వారి కాళ్లకు ముందరి బంధాలు వేస్తున్నారనేది వాస్తవం.