సాధారణంగా బయోపిక్‌లు తీయాలంటే చాలా కష్టం. ప్రతి పాత్రకి మంచి గుర్తింపు ఉన్న వారిని తీసుకుంటేనే బాగుంటుందని కొందరు భావించవచ్చు గానీ కొన్ని సార్లు కొత్తవారిని, లేదా ఫేడవుట్ అయిన వారిని తీసుకోవడం కూడా లాభిస్తుంది. సినిమాలోని ప్రతి పాత్రకి పేరున్న వారినే తీసుకోవాలంటే అది జరిగే పని కూడా కాదు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం రెండు బయోపిక్స్ అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. వైఎస్‌రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర నేపధ్యంలో ‘ఆనందో బ్రహ్మ’ దర్శకుడు మహి.వి.రాఘవ దర్శకత్వంలో ‘యాత్ర’ చిత్రం రూపొందుతోంది. ఇందులో వైఎస్‌గా ముమ్మట్టి, రాజారెడ్డిగా జగపతిబాబు, సూరీడుగా పోసాని కృష్ణమురళి, సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని మణిరత్నం, రావురమేష్, అనసూయ భరద్వాజ్, సచిన్ కేద్కర్, వినోద్‌కుమార్ వంటి వారు నటిస్తున్నారు. ఇక వైఎస్ విజయమ్మ పాత్రకి మొదట ‘బాహుబలి’ ఫేమ్ ఆశ్రితా వేముగంటిని, రాధికా శరత్‌కుమార్‌ల పేర్లు కూడా పరిశీలించారు. చివరకు తమిళ నటి శరణ్యమోహన్‌ని ఎంచుకున్నారని తెలుస్తోంది. నిజంగా శరణ్యలో విజయమ్మ పోలికలు బాగా కనిపిస్తాయి.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ విషయానికి వస్తే ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్, ఏయన్నార్‌గా సుమంత్, నారా చంద్రబాబు నాయుడుగా దగ్గుబాటి రానా, ఎస్వీఆర్‌గా నాగబాబు, సావిత్రిగా మరోసారి నిత్యామీనన్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. తాజాగా మాజీ కేంద్రమంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి పాత్రకు విజయవాడకి చెందిన ప్రముఖ నృత్యకళాకారిణి హిమాన్సీ పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారట. ఇక పురందేశ్వరి చెందిన హిమాన్సీ ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ ఫొటోలో పురందేశ్వరి పక్కన నిల్చుని హిమాన్సీ నవ్వులు చిందిస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక హరికృష్ణ పాత్రను నందమూరి కళ్యాణ్‌రామ్ పోషిస్తున్నాడని అంటున్నారు. మరి పురందేశ్వరి భర్త, ఎన్టీఆర్ హయాంలో హెంమినిస్టర్‌గా ఓ వెలుగు వెలిగిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రలో భరత్ రెడ్డి నటిస్తున్న విషయం తెలిసిందే.