ఏ హీరోకైనా ఒకటి రెండు హిట్స్ రాగానే వెంటనే యాక్షన్, మాస్ చిత్రాల పిచ్చిపట్టుకుంటుంది. ఇలా చేసి గతంలో సునీల్ నుంచి రామ్ వరకు అందరు దెబ్బతిన్నవారే. మొదట హిట్ చిత్రాలలో నటిస్తూ ఉంటే ఆ తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయిన తర్వాత మాస్ జపం చేసినా తప్పు లేదు గానీ దాని కోసం తొందరపడితే మాత్రం దెబ్బతినడం ఖాయం. దీనికి రవితేజ, గోపీచంద్, సాయిధరమ్‌తేజ్ వంటి వారిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నేడు ప్రేక్షకులు కూడా రొటీన్ యాక్షన్, మాస్ చిత్రాలను తిరస్కరిస్తున్నారు. దాంతోనే ఎన్టీఆర్ నుంచి రామ్‌చరణ్ వరకు, ‘నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజీ’ నుంచి ‘ధృవ, రంగస్థలం’ వరకు విభిన్న చిత్రాలు చేయాలని ఉత్సాహం చూపుతున్నారు. అదే గోపీచంద్, రవితేజ వంటి వారు మాత్రం మూస చిత్రాల నుంచి బయటకు రాలేక కెరీర్‌నే దెబ్బతీసుకుంటున్నారు. ఏ హీరోకైనా ట్రెండ్‌ని అనుసరించి ముందుకు వెళ్లడం ముఖ్యం. ప్రేక్షకుల అభిరుచిలో వస్తున్న మార్పులను వారు పసిగట్టాలి.
ఇక విషయానికి వస్తే వరుసగా రెండు ఫీల్‌గుడ్ చిత్రాలతో సూపర్‌స్టార్ మహేష్ బావ సుధీర్‌బాబు ఇప్పుడిప్పుడే విజయాల బాట పడుతున్నాడు. ఆయనకి హిట్స్ ఇచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్’ హర్రర్ కామెడీగా రూపొంది, ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆయనకు మరలా ఇంద్రగంటిమోహనకృష్ణ ‘సమ్మోహనం’తో మరో హిట్ వచ్చింది. తాజాగా విడుదలైన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం కూడా అదే తరహా చిత్రంగా రూపొంది మంచి టాక్ సాధించింది. ఇక ఈయన నటించిన ‘వీరభోగవసంతరాయులు’ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. దీని తర్వాత సుధీర్‌బాబు పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో నటించనున్నాడు. తాజాగా ఆయన తనకు ఓ ఫుల్ ప్యాక్‌డ్ యాక్షన్ చిత్రం చేయాలని ఉందని తెలిపాడు. గతంలో ఈయన ఆ తరహా చిత్రాలలో నటించిన చిత్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.
‘ఆడు మగాడ్రా బుజ్జి, మోసగాళ్లకు మోసగాడు’ వంటి చిత్రాల ఫలితం అందరికీ తెలిసిందే. నేటి రోజుల్లో భారీయాక్షన్ చిత్రాలు వచ్చినా కనీసం బడ్జెట్‌ని కూడా తిరిగి రాబట్టలేకపోతున్నాయి. దీనికి సుధీర్‌బాబు స్నేహితుడైన దర్శకుడు ప్రవీణ్‌సత్తార్.. రాజశేఖర్‌తో తీసిన ‘పీఎస్వీ గరుడవేగ’నే ఉదాహరణ. మరి సుధీర్‌బాబు చేయాలనుకుంటున్న యాక్షన్ చిత్రానికి లేదా పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో ఒకదానికి మాత్రం ప్రవీణ్‌సత్తార్ దర్శకుడు కావడం ఖాయం. ఎంతైనా ఈ విషయంలో సుధీర్‌బాబు కాస్త తొందరపడుతున్నాడనే చెప్పాలి. బహుశా పుల్లెల గోపీచంద్ బయోపిక్‌ని, ఈ యాక్షన్ చిత్రాన్ని కూడా సుధీర్‌బాబు సొంతంగా నిర్మించే అవకాశాలే ఉన్నాయి.