సాధారణంగా సూపర్‌హిట్ అయిన చిత్రాలకు రీమేక్‌లు, సీక్వెల్స్ వస్తూ ఉంటాయి. టైటిల్‌తోనైనా మొదటి భాగం సాధించిన విజయాన్ని క్యాష్ చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తారు. 'గబ్బర్‌సింగ్'కి జోడీగా వచ్చిన 'సర్దార్‌గబ్బర్‌సింగ్', 'శంకర్‌దాదా ఎంబిబిఎస్'కీ సీక్వెల్ 'శంకర్‌దాదా జిందాబాద్', 'విశ్వరూపం'కి, 'విశ్వరూపం 2' వచ్చి దెబ్బతిన్నాయి. ఇక తాజాగా విక్రమ్ 'సామి 2'తో, విశాల్ 'పందెంకోడి 2'తో ప్రేక్షకుల మీద దండయాత్ర చేస్తున్నారు.
ఇక విషయానికి వస్తే డిజాస్టర్ అయిన ఓ చిత్రానికి సీక్వెల్ ప్రయత్నాలు చేస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ వంటి ప్రముఖ తారాగణం నటించిన 'అభినేత్రి' చిత్రం ఎన్నో అంచనాల మధ్య తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్నిమూడు భాషల సినీ ప్రేమికులు తిప్పికొట్టారు. తమన్నా గ్లామర్‌గానీ, ప్రభుదేవా క్రేజ్‌గానీ ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది. ఈ చిత్రానికి ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించాడు.
ఇక దీనికి సీక్వెల్‌గా అభినేత్రి 2కి సన్నాహాలు చేస్తున్నారనే వార్త కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ చిత్రానికి 'అభినేత్రి 2' అనే టైటిల్‌ని కూడా రిజిష్టర్ చేశారట. మొదటి పార్ట్‌లో నటించిన తారాగణమే ఈ సీక్వెల్‌లోనూ నటించనుంది. ఇది వింటుంటే ఎవరి పిచ్చి వారికానందం అనిపించక మానదు.