అశోక్ వల్లభనేని తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులలో ఒకరు. ఆయన నిర్మాతగా.. నాని సెగ, గౌతమ్ మీనన్ ఎర్ర గులాబీలు వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అలాగే ఛలో, గరుడవేగ.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఫైనాన్స్ అందించి తన అభిరుచిని చాటుకున్నారు. పెద్ద నిర్మాతలు ఆయనను లక్కీ హాండ్ గా భావించి వాళ్ల సినిమాలకి ఆయన చేత్తో ఫైనాన్స్ తీసుకుంటారు. అలా ఆయన చేతితో ఫైనాన్స్ తీసుకున్న ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు మరో భారీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు ముందుకు త్వరలో వస్తున్నారు.
సంచలన దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్క చీవంత వాణం’. తెలుగులో ‘నవాబ్’ పేరుతో విడుదలకు సిద్ధంగా ఉంది. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్, అదితి రావ్ హైదరి, జయసుధ, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగు రిలీజ్ హక్కులు అశోక్ వల్లభనేని భారీ రేట్ కు సొంతం చేసుకున్నారు. ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందిస్తున్నారు.
భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో సెప్టెంబర్ 25న ఏర్పాటు చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మణిరత్నం, ఎ.ఆర్. రెహమాన్ రానున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.