నిజానికి వేటూరి సుందరామ్మూర్తి మరణం, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అనారోగ్యం కారణంగా సినిమాలకు పాటలు రాయడం తగ్గించిన తర్వాత తెలుగు సినీ సాహిత్యం అంపశయ్యపై ఉందనే విషయాన్ని అందరు అంగీకరిస్తారు. చివరకు కీరవాణి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసి నేటి రచయితల విమర్శలను ఎదుర్కొన్నా ఇందులో వాస్తవం ఉంది. అయితే ఆ స్థానంలో రామజోగయ్యశాస్త్రి తనవంతుగా అద్భుతమైన పాటలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాలలో మాటలే కాదు.. పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఉంటాయి. ఈ విషయం 'అరవిందసమేత వీరరాఘవ' చిత్రం మొదటి పాట ఇప్పటికే నిరూపించింది.
ఇక రెండో పాటగా 'పెనివిటి' అంటూ సాగే పాటను యూనిట్ విడుదల చేసింది. అద్భుతమైన రాయలసీమ మాండలికంలో సాగిన ఈ పాట భర్తరాక కోసం ఎదురు చూస్తూ భార్య పడే ఆవేదనకు అద్దం పట్టింది. 'నువ్వు కడుపున పడినాకే మీ అమ్మను గెలిసేసినాను అనుకున్నాడో ఏందో....దాన్ని వంటింటిలో వదిలేసి వరండాలోకి పోయి ఊరుని గెలసటం మొదలు పెట్టినాడు అంటూ' తారక్ తల్లి కష్టాన్ని వర్ణించారు రామజోగయ్యశాస్త్రి. కాలభైరవ ఈ పాటను ఆలపించాడు. 'నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిశాను... నువ్వొచ్చే దారుల్లో చూపుల్ని పరిశాను.. ఒంటెద్దు బండెక్కిరారా..సిగిలేటి డొక్కల్లో..పదిలంగా రారా...నలిగేటి నా మనసు గురుతొచ్చిరారా..పెనివిటి ఎన్నినాళ్లైందో నిన్నుసూసి కనులారా.. నువ్వు కన్న నలుసునైనా.. తలసి తలసి రారా..పెనివిటీ'.. అంటూ సాగిన ఈ పాటను చూస్తే సాహిత్యం పైనే ఇంత శ్రద్ద పెట్టించిన త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని అందరు మర్చిపోయేలా మంచి ఎమోషనల్ కథాంశంతో ఈ చిత్రం ద్వారా వస్తున్నాడని అర్దమవుతోంది.
తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తుండగా, రాయలసీమ బ్యాక్‌గ్రాప్‌తో చిత్తూరు యాసతో హీరో క్యారెక్టర్ తీర్చిదిద్దిన ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.