ప్రేక్షకుల అభిరుచి, మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా నటీనటులు , దర్శకులు మారాల్సి వుంటుంది. అంతేకాదు.. సినీ పరిశ్రమలో వస్తోన్న విపరీతమైన మార్పులను నిర్మాతలు కూడా అనుసరించి అప్‌డేట్ అవుతూ ఉండాలి. అలా చేయలేని కారణంగానే కిందటి తరంలో ఉన్న ఎందరో పేరు గాంచిన నిర్మాతలు ఇండస్ట్రీకి దూరంగా వెళ్తున్నారు. మారుతున్న పరిశ్రమ పోకడలను వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్ చేస్తున్న విధంగా తమను తాము అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. నవతరంలో అభిరుచి కలిగిన వ్యక్తులను ఎంచుకుని వారి సలహాలు, సంప్రదింపులతో సినిమాలను నిర్మించాల్సివుంటుంది. అలా అల్లు అరవింద్‌కి ఎంతో ప్రియమైన శిష్యులలో బన్నీవాస్ ఒకరు.
గీతాఆర్ట్స్2 బేనర్‌ని చేతిలో ఉంచుకుని ఇటీవలే 10కోట్ల బడ్జెట్‌తో తీసిన 'గీతగోవిందం' ద్వారా 100కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్డాడు. అలా నేటితరానికి ప్రతినిధిగా బన్నీవాస్‌ని చెప్పుకోవాలి. అల్లుఅర్జున్ ముద్దుపేరైన బన్నీని తన వాసు పేరు ముందు చేర్చుకున్నాడు. ఇక తాజాగా ఈయన అల్లుఅర్జున్ గురించి మాట్లాడుతూ, నేను.. అల్లుఅర్జున్ మంచి స్నేహితులమే అయినప్పటికీ ఇద్దరి ఆలోచనా విధానం మాత్రం ఎంతో భిన్నంగా ఉంటుంది. నిదానమే ప్రదానం అన్నట్లుగా నేనుంటాను. ఏదేమైనా సరే అనుకున్న తర్వాత దూకేద్దాం అన్నట్లుగా అల్లు అర్జున్ మనస్తత్వం ఉంటుంది.
'ఆర్య' చిత్రం సమయంలో పక్కరోజు షూటింగ్ ఉండగా, ముందురోజు ఉదయం అల్లుఅర్జున్ ట్రాన్సిల్ సర్జరీ' చేయించుకున్నాడు. విశ్రాంతి తీసుకోకుండానే సాయంత్రం బెంగుళూర్ వెళ్లి సినిమాకి కావాల్సిన కాస్ట్యూమ్స్ షాపింగ్ చేయాలని పట్టుబట్టి తీసుకెళ్లాడు. ఒక్కమాట ఇంట్లో చెప్పి వెళ్దామన్నా ఒప్పుకోలేదు. సినిమా పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అలాంటిది. ఈ విషయంలో ఆయన దేనిని లెక్కచేయడు.. అని బన్నీవాసు చెప్పుకొచ్చాడు.