నాని హోస్ట్ చేస్తోన్న ‘బిగ్‌బాస్ సీజన్2’ చరమాంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ షో ముగియనుంది. హౌస్‌లో ఏడుగురు సభ్యులున్నారు. ఈవారం ఒకరి ఎలిమినేషన్‌తో ఆరుగురు మిగిలారు. మరోవారంలో మరొకరు హౌస్‌ని వీడనున్నారు. చివరకు ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్‌కి వెళతారు. ఇప్పటివరకు హౌస్ పరిస్థితులను బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారా? అనే విషయంలో ప్రేక్షకులు ఓ అంచనాకు బాగానే వస్తూ ఉన్నారు. కానీ గత రెండు వారాలుగా అంచనాలను తల్లకిందులు చేస్తూ బిగ్‌బాస్ పెద్ద ట్విస్ట్‌లనే ఇస్తూ వచ్చారు. దానికి తోడు శనివారం కౌశల్‌పై నాని సీరియస్ కావడం, రెడ్‌ఫిష్ స్టోరీ చెప్పడం పలు అనుమానాలకు దారి తీసింది.
గత రెండు వారాలుగా బిగ్‌బాస్ చలవతో బయటపడిన అమిత్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం అమిత్‌తోపాటు ఎలిమినేషన్ జాబితాలో కౌశల్, దీప్తి, రోల్‌రైడా, గీతామాధురి ఉన్నా కూడా వారంతా సేఫ్ అయ్యారు. గేమ్ మొదటి నుంచి అమిత్ సేఫ్‌గేమే ఆడాడు. కంటెస్టెంట్‌లతో ప్రేమగా ఉంటూ ఎలిమినేషన్‌లోకి రాకుండా జాగ్రత్త పడ్డాడు. దీనికి తోడు కమల్‌హాసన్ వల్ల రెండు వారాలు ఎలిమినేషన్‌కి గురయ్యే అవకాశం లేకుండా తప్పించుకున్నాడు. దీంతో అమిత్‌కి తక్కువ ఓట్లే వచ్చినప్పటికీ బిగ్‌బాస్ ఆయన్ను రెండు వారాలు సేఫ్ చేశాడు. ఈసారి మాత్రం అమిత్‌ని బిగ్‌బాస్ కాపాడలేకపోయాడు.
సినిమాలలో విలన్ వేషాలు వేసే అమిత్‌కు ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. సినిమాలలో విలన్ అయినా హౌస్‌లో చిన్నపిల్లాడిలా ప్రవర్తించేవాడు. కొన్నిసార్లు అది ఫన్నీగా ఉన్నా మరికొన్ని సార్లు చికాకు తెప్పించేది. ఇక కెమెరాల ముందు వచ్చిరాని తెలుగుతో ఆయన మాట్లాడిన విధానం నస తెప్పించేది. ఈ విషయాన్ని హోస్ట్ నాని కూడా పలుమార్లు చెప్పి మందలించాడు. అవే ప్రేక్షకుల నుంచి అమిత్‌కి ఓట్లు తెప్పించలేకపోయాయి. టాస్క్‌లలో సరిగా శ్రద్దచూపక, ఏవేవో కుంటిసాకులు చెప్పడం కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పించడం అమిత్ ఎలిమినేషన్‌కి ప్రధాన కారణంగా చెప్పాలి.