మారుతి దాసరి.. సినిమాల మీద అసక్తితో ఫీల్డ్‌కి వచ్చాడు. ‘ప్రేమిస్తే, ఎ ఫిల్మ్‌బై అరవింద్’ చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథా చిత్రమ్ వంటి చిత్రాలకు రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా కూడా పనిచేశాడు. మహేష్, రొమాన్స్, పిజ్జా, లవ్ యు బంగారం వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. గ్రీన్‌సిగ్నల్, లవర్స్ చిత్రాలకు కోప్రోడ్యూసర్‌గా పనిచేసి అల్లుశిరీష్ హీరోగా గీతాఆర్ట్స్ బేనర్‌లో కొత్తజంటకి దర్శకునిగా పనిచేశాడు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, బాబు బంగారం, శైలజారెడ్డి అల్లుడు వంటి చిత్రాలకు దర్శకునిగా చేసి స్టార్‌డైరెక్టర్‌గా మారాడు.
ఈయన తాజాగా ‘శైలజారెడ్డి అల్లుడు’ ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ.. ఆరంభంలో యూత్‌కి నచ్చేచిత్రాలనే తీశాను. కొత్తనటీనటులతో ఎక్కువగా పనిచేశాను. కానీ స్టార్ దర్శకునిగా ఎదగాలంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించడం కూడా అవసరమని భావించాను. నా సినిమాలు బాగా ఆడాలంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ధియేటర్ల వద్దకు తీసుకుని రావాల్సిఉంటుందని తెలుసుకున్నాను. మా నాన్నది అరటిపండ్ల బండి. ఆయన చాలా కష్టాలు పడ్డాడు. నేను కూడా అరటిపండ్లు అమ్మినరోజులున్నాయి. ఆ తర్వాత ఆఫీస్‌బోయ్‌గా పనిచేశాను.జేబులో ఉన్న రెండు రూపాయలతో జిలేబీ తిని నీళ్లు తాగి కడుపునింపుకున్న రోజులు కూడా ఉన్నాయి. అదేరోడ్డులో నేను ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతున్నాను. నేను ఈ స్థాయికి చేరుకుంటానని.. నేనే ఊహించలేదు..’’ అని ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు.