సెలబ్రిటీ హోదా వచ్చిందని ఆనందించవచ్చు గానీ దాని వల్ల ప్రైవసీ కోల్పోయి ఇంతకు ముందులా ఎక్కడపడితే అక్కడికి స్వేచ్చగా తిరిగే వీలుండదు. అభిమానుల అత్యుత్సాహం వల్ల తమ సొంత జీవితంలో ఎంతో కోల్పోవాల్సివుంటుంది. అయినా సెలబ్రిటీలు కూడా మానవమాత్రులే కదా...! వారికి కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ స్టార్‌స్టేటస్ వచ్చిన తర్వాత వారు పంజరంలో చిలకల్లా స్వేచ్చను పోగొట్టుకుంటారు. ఇక ఎక్కడికైనా వెళ్లినప్పుడు అభిమానులు చూపే అత్యుత్సాహం మరో కొత్త తలనొప్పి, సెలబ్రిటీలు కూడా మానవమాత్రులే కాబట్టి వారికి కూడా ఎన్నో పనులు ఉంటాయి. కానీ కనిపించిన ప్రతి చోటా అభిమానులు రచ్చచేస్తే వారికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చివరకు తమకు ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉన్నప్పుడు కూడా ఫ్యాన్స్ వేళాపాళా లేకుండా తమ హీరోల కోసం నినాదాలు చేయడం బాధకలిగించే విషయమే.
ఇక ఇలాంటివి ఎదుర్కొనేందుకు మన వారి వద్ద రెండు ఆయుధాలు ఉంటాయి. బాలకృష్ణలాగా శృతిమించిన అభిమానులను తన ముష్టిఘాతాలతో క్రమశిక్షణలో పెట్టడం ఒకటైతే రెండోది బౌన్సర్ల మీద ఆధారపడటం. ఇక విషయానికి వస్తే కోలీవుడ్ స్టార్ విజయ్‌కి కోట్లాదిమంది అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్నాయి. వాటిని విజయ్ ప్రజాసంఘాలుగా మార్చివేశాడు. విజయ్ అఖిల భారత అభిమాన సంఘం అద్యక్షుడు, పాండిచ్చేరి మాజీ శాసనసభ్యుడు ఆనంద్‌కూతురు వివాహం తాజాగా పాండిచ్చేరిలో జరిగింది. ఈ వేడుకకు విజయ్ వస్తున్నాడన్న విషయాన్ని ఆనంద్ ముందుగానే అభిమానులకు తెలియజేశాడు. కళ్యాణమండపం వద్ద విజయ్ ఫొటోలతో కటౌట్లు, పోస్టర్లు పెట్టారు. విజయ్ తన సతీమణి సంగీతతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించడానికి పాండిచ్చేరికి వెళ్లాడు.
కళ్యాణమండపంలోకి వెళ్లగానే వేలాది మంది అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. బౌన్సర్లు అడ్డుకున్నా లాభం లేకుండా పోయింది. విజయ్ అలాగే వేదికపైకి వెళ్లినూతన వధూవరులను ఆశీర్వదించే ప్రయత్నం చేశాడు. కానీ అభిమానుల తోపులాటలో ఆయన కింద పడబోయాడు. కాలికి దెబ్బ కూడా తగిలింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. లాఠీచార్జ్ చేసి విజయ్, సంగీత దంపతులను అక్కడి నుంచి సురక్షితంగా పంపివేశారు. మరి అత్యుత్సాహం అంటే ఎలా ఉంటుందో మరోసారి విజయ్‌కి అనుభవమై ఉంటుంది.