యాక్షన్‌కింగ్ అర్జున్ కెరీర్ 1981లో ప్రారంభం అయింది. కర్ణాటకలోని మైసూర్ జిల్లా మధుగిరికి చెందిన ఈయన అసలు పేరు అర్జున్ సజ్రా. 1981లో కన్నడ చిత్రాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బాడీబిల్డర్, కరాటే బ్లాక్‌బెల్టర్ అయిన ఆయన 1984లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో పూర్ణిమ జంటగా వచ్చిన 'మా పల్లెలో గోపాలుడు' తో పెద్ద హిట్ కొట్టాడు. ఆయన కెరీర్ ప్రారంభించిన నాటికి ఈ తరం యువకులు అసలు పుట్టి ఉండకపోవచ్చు. ఇన్నేళ్లయినా షష్టి పూర్తికి సమీపిస్తున్నా కూడా ఆయన బాడీని మెయిన్ టెయిన్ చేసే తీరు అద్భుతం.
ఆ తర్వాత ఈయన కోలీవుడ్‌కి వెళ్లి శంకర్ వంటి దర్శకులను పరిచయం చేయడమే కాదు.. కమల్‌హాసన్ వంటి వారి ప్రశంసలు పొంది, దర్శకునిగా, నిర్మాతగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఇలా పలు అవతారాలు ఎత్తాడు. ఈయన నటించిన చిత్రాలలో 'జెంటిల్‌మేన్, ఒకే ఒక్కడు, ద్రోహి' వంటి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఇక ఈయన దర్శకునిగా కూడా దేశభక్తి చిత్రాలను తీయడంలో ముందుంటాడు. తెలుగులో జగపతిబాబుకి ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆయన ఎక్కువ చిత్రాలలో పోలీస్ ఆఫీసర్ పాత్రలను పోషించి మెప్పించాడు. తాజాగా విడుదల కానున్న 'కురుక్షేత్రం' చిత్రంలో కూడా ఆయన పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించనున్నాడు.
ఆయన తాజాగా మాట్లాడుతూ, ఒకసారి నేను ఒక చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నాను. పోలీస్ డ్రస్‌లోనే షూటింగ్‌కి కారులో బయలుదేరాను. మార్గం మధ్యలో ఓ పోలీస్ మరో రూట్‌లో వెళ్లమని నా కారును ఆపేశాడు. నేను విండో గ్లాస్ కిందకి దించడంతో నేను నిజంగానే పోలీస్ ఆఫీసర్‌ని అని భావించి సెల్యూట్ చేశాడు. ఆ తర్వాత మీరు హీరో అర్జున్ కదా.. ! అంటూ గుర్తుపట్టాడు అని నవ్వుతూ అర్జున్ చెప్పుకొచ్చాడు.