కళాకారులు సున్నిత మనస్కులు. చిన్నచిన్న విషయాలకు కూడా బాగా రియాక్ట్ అవుతూ ఉంటారు. వీరిలోని ఆ సున్నితగుణమే వారిని కళాకారులను చేస్తుంది. కోపం, దు:ఖం, ఆనందం.. ఇలా ఏమి వచ్చినా తట్టుకోలేరు. అందుకే పలువురి జీవితాలలో పెద్ద పెద్ద తప్పిదాలు కూడా క్షణంలో జరిగిపోతూ ఉంటాయి. కానీ డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి రోహిణిది మాత్రం అలా కాదు. తన జీవితంలో కొండంత విషాదం ఉన్నా నిండుకుండలా కనిపిస్తుంది. జీవితం మొత్తం మోయాల్సిన ఆ విషాదాన్నే ఆమె ఆకురాయిగా చేసుకుని తన కళకి సానబడుతుందేమో.. !
ఈమె తాజాగా మాట్లాడుతూ, మాది అనకాపల్లి, ఇంటిపేరు మొల్లేటివారు, నాన్న రావునాయుడు పంచాయతీ అధికారి, లారీల బిజినెస్ కూడా చేసేవారు. ఆయనకు సినీనటుడు కావాలని కోరిక. అందుకోసం తరచుగా చెన్నై వెళ్తుండేవారు. ముగ్గురు అన్నల తర్వాత నేను, నా తర్వాత ఓ తమ్ముడు ఉన్నారు. తమ్ముడు పుట్టగానే అమ్మ సరస్వతి మరణించింది. అప్పటికీ నాకు ఐదేళ్లు కూడా లేవు. నాన్నతో కలసి 'యశోదకృష్ణ' చిత్రం సెట్స్‌కి వెళ్లాను. ఆ దర్శకుడు నాలో ఏమి చూశాడో గానీ అందులో చిన్నికృష్ణుడి పాత్రను నాతో వేయించారు. బడికెళ్లి చదువుకోవాలని ఉండేది. కానీ ఎవ్వరికీ లేని ప్రతిభ, అదృష్టం నీకు వచ్చాయి. నటించమని నాన్నగారు చెప్పారు. పన్నెండేళ్ల వయసులో బాలనటిగా గానీ పెద్ద పాత్రలకి గాను వీలు కాని వయసు. అప్పుడు బ్రేక్ వస్తే అక్షరాభాస్యం అప్పుడు చేశాను. అలా మూడేళ్లు గడిచిన తర్వాత ఓ మలయాళ చిత్రంలో అవకాశం వచ్చింది. అదీ హీరోయిన్‌గా, రఘువరన్ గారిని మొదట చూసింది 'కక్క'(గవ్వ) అనే ఆ చిత్రంలోనే. అది హిట్ కావడంతో మలయాళంలో బిజీ అయిపోయాను.
అడపాదడపా తెలుగు, తమిళ చిత్రాలు చేసే దానిని. జంధ్యాల గారి 'నాలుగు స్తంభాలాట' అలాంటిదే. ఆ సినిమాకి అసోసియేట్‌గా ఉన్న పాణి మణిరత్నం గారి 'గీతాంజలి'కి కూడా పనిచేశారు. ఆయన అడగడంతో తొలిసారి గిరిజ గొంతుకి వాయిస్ ఇచ్చాను. 'లేచిపోదామా' అనే డైలాగ్‌కి నాకు మంచి పేరొచ్చింది. అయినా మరెప్పుడు డబ్బింగ్ చెప్పకూడదనే అనుకున్నాను. 'గీతాంజలి' చిత్రం చూసిన వర్మ 'శివ' చిత్రంలో అమల పాత్రకి డబ్బింగ్ చెప్పమని కోరారు. తెలుగు, తమిళంలో కనిపించే మెలోడ్రామా నాకు అసలు నచ్చదు. నేచురల్‌గా ఉండే మలయాళ చిత్రాలే ఇష్టం. దాంతో నో చెప్పాను. ఆ సినిమా యూనిట్ నన్ను మరలా అడిగితే వర్మ కొత్త దర్శకుడు కదా...! ఆయన ఎలా తీస్తారో? ముందుగా సినిమా చూపించమని అడిగాను. అది సాదాసీదా తెలుగు చిత్రం కాదని మొదట్లోనే అర్ధమైంది. ఇంటర్వెల్ సమయానికే నేను అమలకి డబ్బింగ్ చెబుతున్నానని చెప్పేశాను. డబ్బింగ్ వల్ల నా నటన కూడా మెరుగుకావడం గమనించి ఇక డబ్బింగ్‌ని కూడా కొనసాగించాను అని చెప్పుకొచ్చింది.