ఎమ్మెల్యే సీటు కోసం తనని కలిసి తనతో ముచ్చటించాలంటే రూ.10లక్షలు డోనేషన్ ఇవ్వాలని పవన్ కండీషన్ విధించాడంటూ ఓ వర్గం మీడియా దుమ్మెత్తిపోస్తోంది. మరోవైపు పవన్ చంద్రబాబు, లోకేష్‌లపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక తాజాగా పవన్ మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి జగన్‌ని చీటర్, మోసగాడు అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు. ఇక విషయానికి వస్తే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తమ పార్టీ నుంచి మొదటి అభ్యర్థిని ప్రకటించాడు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పితాని బాలకృష్ణని తన పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాడు. గతంలో ఈయన ఇదే నియోజకవర్గానికి వైసీపీ పార్టీ ఇన్‌చార్జ్‌గా పనిచేశాడు. గత నెలలోనే ఆయన జనసేనలో చేరారు.
ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ... 'జగన్ నన్ను మోసం చేశాడు. నాకు టిక్కెట్ ఇస్తానని చెప్పి నా ఉద్యోగానికి రాజీనామా చేయించాడు. కానీ ఇప్పుడు వేరే వారికి ఇస్తానని చెప్పి నన్ను మోసం చేశాడు. జగన్‌ని నమ్మకండి... ఆయన పెద్ద మోసగాడు' అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గతంలో నా వద్ద డబ్బులేదని ఓ సర్వేలో తేలింది. అందుకే టిక్కెట్ ఇవ్వలేనని జగన్ చెప్పినట్లు పితాని బాలకృష్ణ ఆరోపించాడు. ఇక మొదటి అభ్యర్ది విషయంలో పవన్ వ్యూహాత్మకంగానే అడుగులు వేసినట్లు కనిపిస్తోంది. పితాని బాలకృష్ణ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కోస్తా జిల్లాలలో ఈ సామాజిక వర్గానికి మంచి పట్టు ఉంది. దాంతోనే పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.
ఇక ఇదే తరహాలో పవన్ అన్నయ్య చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఓ సభలో ఆసక్తికర ప్రసంగం చేసిన దళిత మహిళ తుపాకుల మున్నెమ్మకి టిక్కెట్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఆమె వంక చూడటం గానీ, ఆమె తరపున ప్రచారం చేయడం గానీ చేసిన పాపాన పోలేదు. మరి పవన్ తన మొదటి అభ్యర్థి విషయంలో ఏమి చేస్తాడో వేచిచూడాల్సివుంది...!