ప్రస్తుతం దేశంలో ఇజాలు, ఆర్మీలు బాగా విస్తరిస్తున్నాయి. పవనిజం, పాలిజం.. ఇలా ఎన్నో ఇజాలు పుట్టుకొచ్చాయి. ఇక సోషల్‌మీడియా వేదికగా పవన్‌కళ్యాణ్ ఆర్మీ, లోకేష్ ఆర్మీ, జగన్ ఆర్మీ అంటూ పుట్టగొడుగుల్లా ఇవి పుట్టుకొస్తున్నాయి. దానికి తాజాగా బిగ్‌బాస్ కంటిస్టెంట్ కౌశల్ పేరు మీద కూడా ఓ ఆర్మీ మొదలైంది. నిజంగా దేశం కోసం, దేశ ప్రజల కోసం నిద్రాహారాలు మాని, శత్రువుల చేతుల్లో మరణించే నిజమైన ఆర్మీజవాన్లను కూడా పట్టించుకోని కొందరు ఏదో టైంపాస్ వ్యవహారంగా సాగే బిగ్‌బాస్ పార్టిసిపెంట్ కోసం కౌశల్ ఆర్మీని పెట్టి నానా హంగామా చేస్తూ ఉంటే వీరికి తిన్నది అరగలేదా? తల్లిదండ్రులపై కూడా లేని ప్రేమ వీరిపై ఎలా వస్తోంది? అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ ఆర్మీ వెనుక కౌశల్ భార్య ప్రమేయం ఉందని, ఆమె ప్రోత్సాహంతోనే కౌశల్ ఆర్మీ రెచ్చిపోతోందన్న వాదన, విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక విషయానికి వస్తే బిగ్‌బాస్ సీజన్2కి ఎంపికై ఒకసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయి, తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరోసారి ప్రవేశం చేసి, తాజాగా హౌస్ నుంచి నిష్క్రమించిన శ్యామలపై కౌశల్ ఆర్మీ మండిపడుతోంది. దీనికి కారణం శ్యామల బిగ్‌బాస్ విన్నర్‌గా కౌశల్ నిలుస్తాడని చెప్పకపోవడమే. ఈ వారం ఎలిమినేట్ అయిన శ్యామల టాప్ త్రీలో ఎవరుంటారు? అన్న ప్రశ్నకు గీతామాధురి, తనీష్, రోల్‌రైడా పేర్లను చెప్పింది. ఈ ముగ్గురిలో కౌశల్ పేరు లేకపోవడం కౌశల్ ఆర్మీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇంకేముంది.. వారు సోషల్ మీడియాలో శ్యామలను ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. రీఎంట్రీ సమయంలో తమ ఓట్లతోనే రెండోసారి హౌస్‌లోకి వచ్చిన శ్యామల ఇప్పుడు విన్నర్లలో కౌశల్ పేరు చెప్పకుండా మిగిలిన వారి పేర్లు చెప్పడం ఏమిటని మండిపడుతున్నారు.
బిగ్‌బాస్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ని ఆమె చదివిందని కొందరు. నాని ఎవరి పేరు చెప్పమంటే వారి పేరే చెప్పిందని మరికొందరు ఫేస్‌బుక్‌లో శ్యామలపై మండిపడుతున్నారు. కౌశల్ ఆర్మీ పవరేంటో మీకు బాగా తెలుసు. అయినప్పటికీ కౌశల్ పేరు చెప్పలేదు. బిగ్‌బాస్2 విన్నర్ విషయంలో నీ గెస్సింగ్ తప్పు. తాజాగా కౌశల్ ఆర్మీ చేసిన 2-కె రన్‌ని చూసైనా నీ అభిప్రాయం మార్చుకోవాలి. బై.బై మేడమ్. వచ్చే వారం నీ స్నేహితులను కూడా నీ దగ్గరికే పంపిస్తాం. వారితో కూర్చుని కబుర్లు చెప్పుకోండి.. అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అయినా ఎవరి అభిప్రాయం వారు చెప్పడం కూడా తప్పా? అనేది ఆలోచించాల్సిన విషయం.