యూఎస్‌లోని చికాగోకి చెందిన మలయాళీ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. ఈమె తన మొదటి చిత్రం బాలనటిగా మలయాళంలో 'స్వప్న సంచారి' చిత్రంలో నటించింది. ఇందులో ఆమె జయరాం, సంవృతా సునీల్‌ల కూతురిగా నటించింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి నవీన్‌పౌళి హీరోగా నటించిన 'యాక్షన్ హీరో బిజ్జు'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'మజ్ను' చిత్రంలో నానికి జోడీగా కిరణ్మయి పాత్రను చేసింది. ఈ చిత్రం మంచి హిట్ కావడంతో ఆమెకి వరుస అవకాశాలు వచ్చాయి. రాజ్‌తరుణ్‌తో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', గోపీచంద్ నటించిన 'ఆక్సిజన్' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా, పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన డిజాస్టర్ మూవీ 'అజ్ఞాతవాసి'లో కూడా సెకండ్ హీరోయిన్‌గా, అల్లుఅర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన 'నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా' వంటి చిత్రాలలో నటించింది. అతి తక్కువ సమయంలోనే పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్, అల్లుఅర్జున్ వంటి వారితో చాన్స్‌లు దక్కించుకోవడంతో ఇక ఈమెకి తిరుగేలేదని పలువురు భావించారు.
కానీ ఈ చిత్రాలేవీ విజయం సాధించలేదు. ఇక తమిళంలో విశాల్ హీరోగా నటించిన 'తుప్పరివాలన్' చిత్రం విజయం సాధించినా ఈ అమ్మడిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. 'గీతగోవిందం'లో కాసేపు మెరిసిన ఈ భామ 13వ తేదీన విడుదల కానున్న నాగచైతన్య-మారుతి-రమ్యకృష్ణల 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలో తల్లి రమ్యకృష్ణ నుంచి ఇగోని పుణికిపుచ్చుకున్న కూతురిగా నటిస్తోంది. ఇక ఈమె వార్తల్లో లేకపోవడం వల్లనేమో ఈమె తన గురించి తానే పొగుడుకుంటూ వార్తల్లో నిలవాలని చూస్తోంది. తాజాగా ఈమె మాట్లాడుతూ, నా నడకలోనే ఓ స్టైల్ ఉంది. ఓ కిక్కు ఉంది.. అంటూ స్వీయభజన చేసింది. మరి ఇది ప్రేక్షకులు ఎంత వరకు నమ్ముతారో తెలియదు గానీ ఈమె దానిపై వివరణ ఇస్తూ, నేను భారతీయ సంప్రదాయం ప్రకారం చీరకట్టినా కూడా నాలో అమెరికా అమ్మాయి లక్షణాలు కనిపిస్తున్నాయని అందరు అంటున్నారు.
నేను ఏమి చేసిన భారతీయ యువతులకు బాడీలాంగ్వేజ్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. నేను కూర్చున్నా, నడిచినా కూడా భారతీయ స్త్రీలకు భిన్నంగా అమెరికా స్లైల్‌లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నా నడకలోనే ఓ కిక్కు ఉంటుంది. దానికి కారణం నేను అమెరికా అమ్మాయిని కావడమే. ఇక్కడి చిత్రాలలో నటిస్తున్నందువల్ల ఇక్కడ మహిళల పద్దతులు, నడక, చీరకట్టు వంటివి గమనిస్తూ ఉంటాను. నేను చాలా శాంతస్వభావిని, పెద్దగా మాట్లాడను. ఇతరులు ఎంతగా మాట్లాడుతున్నా వింటూ గమనిస్తూ ఉంటాను. 'శైలజారెడ్డి అల్లుడు'లో ఇగోతో అరిచి పెద్దగా మాట్లాడే సీన్స్‌ని చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం కలుగుతోంది.. అంటూ చెప్పుకొచ్చింది. మరి పవన్, బన్నీ ఇవ్వలేని బ్రేక్‌ని నాగచైతన్య, త్రివిక్రమ్ వంటి వారు చేయలేని పనిని మారుతి చేస్తారా లేదా అనేది వేచిచూడాల్సివుంది...!