అందరు కొత్త నటీనటులతో మొదటి చిత్రం ద్వారానే వెంకటేష్ మహా అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం 'కేరాఫ్ కంచరపాలెం'. ఈచిత్రం అద్భుతమని దీనిని చూసిన సాధారణ ప్రేక్షకులే కాదు... మహేష్‌బాబు, రాజమౌళి, క్రిష్ వంటి ఎందరో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి నేచురల్ స్టార్ నాని స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, చక్కని చిత్రం 'కేరాఫ్ కంచరపాలెం'థియేటర్లలో ఆడుతోంది. దయచేసి ఈ సినిమాని మిస్ కాకండి. ఈ చిత్రం గురించి చాలా చెప్పాలి. కానీ ట్వీట్, పోస్ట్ ద్వారా వివరంగా చెప్పలేనేమో అనిపించింది... అంటూ ఓ వీడియో లింక్‌ని పోస్ట్ చేశాడు. అందులో ఆయన తన అభిప్రాయం పంచుకున్నాడు.
'కేరాఫ్ కంచరపాలెం' స్పెషల్ షో వేస్తున్నాం. చూస్తారా? అని అడిగారు. నా స్నేహితులు కూడా చూసి బాగుంది అన్నారు. కానీ డేట్స్ కుదరక, పనులు ఉండి వెళ్లలేకపోయాను. సినిమా బాగుంటుందని తెలిసి మొన్న వెళ్లా. కానీ ఈ చిత్రం నా అంచనాలను మించి వందరెట్లు ఉంది. ఎప్పుడో చిన్నతనంలో చూసిన 'మాతృదేవోభవ' వంటి చిత్రాలు చూసి ఏడ్చాం. కొన్ని సందర్భాలలో కొన్ని సీన్స్ చూసి బాధతో ఏడుస్తుంటాం. కానీ తొలిసారి సినిమా చూసి ఏడుస్తున్నంత లోపే, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి అనుభవం నాకు జీవితంలో ఎదురు కాలేదు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఈ చిత్రం గురించి ప్రేక్షకులకు ఏమని, ఎలా చెప్పాలి అని ఆలోచించాను. సినిమా నాపై అలాంటి ప్రభావం చూపింది.
ఇందులో ఓ పాత్రను నేను చేసి ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఇందులో నేను నటించి ఉంటే సినిమా చెడిపోయేదే అనిపించింది. నేనే కాదు.. మనకి తెలిసిన ఏ నటుడు ఉన్నా సినిమా ఇంత బాగా ఉండేది కాదు. తెలుగుతనాన్ని ఇందులో అంత బాగా చూపించారు. తెలుగుదనం అంటే నాకు గుర్తొచ్చే ఒకే ఒక్క చిత్రం 'సీతారామయ్యగారి మనవరాలు'. ఇప్పుడు దాని తర్వాత 'కేరాఫ్ కంచరపాలెం'.. మొత్తం చిత్ర బృందం అద్భుతంగా పనిచేశారు' అని నాని ఈ చిత్రాన్ని అద్భుతంగా, ఎవ్వరూ వర్ణించలేని విధంగా వివరించాడు.