పరుచూరి గోపాలకృష్ణ ఎన్నో వందల చిత్రాలకు రచన అందించినప్పటికీ ఇప్పటికీ ఆయన ఏదైనా సినిమా విషయం వస్తే ఏదో మేధావిలా, సినీరంగంలో ఎంతో అనుభవం ఉన్న వాడిలా సినిమా చూడరు. కేవలం ఓ సగటు ప్రేక్షకునిగానే ఆయన సినిమాలు చూస్తారు. అదే ఆయనను ఇన్ని తరాల పాటు రచయితగా రాణించేలా చేసిందని చెప్పాలి.
ఇక పరుచూరి గోపాలకృష్ణ తాను తాజాగా చూసిన చిత్రాల గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. తాజాగా ఈయన అడవిశేషు నటించగా ఘనవిజయం సాధించిన 'గూఢచారి' చిత్రం గురించి చెప్పుకొచ్చారు. నేను ఎప్పుడైనా ఏ చిత్రం చూసినా సాధారణ ప్రేక్షకుడిగానే చూస్తాను అంతేగానీ నా వెనుక 400 చిత్రాల చరిత్ర ఉందనే విషయం మర్చిపోతాను. నా వెనుక ఎంతో అనుభవం ఉంది అనే దృష్టితో సినిమా చూస్తే అది మనకి ఎక్కదు. అలా సాధారణంగా భావించి నేను చూసిన 'గూఢచారి' చిత్రం నాకెంతో నచ్చింది. ఈ చిత్రం విషయంలో ముందుగా ప్రస్తావించాల్సింది స్క్రీన్‌ప్లే రైటర్స్‌ని, ఇక కథా రచనలోనూ అడవిశేషు పాల్గొన్నాడు.
ఆయన ఎన్నో ఏళ్లుగా ఎంత కష్టపడుతూ వస్తున్నాడో నాకు తెలుసు. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఒకరోజు వస్తుంది. అలా అడవిశేషుకి కూడా 'గూఢచారి'తో ఆ రోజు వచ్చింది. అద్భుతమైన విజయాన్ని అందించింది అని చెప్పుకొచ్చాడు. అయినా 'గూఢచారి' బ్యాడ్‌లక్ వల్ల ఈ చిత్రం విడుదలైన కొద్దిరోజులకే 'గీతగోవిందం' రావడం ఆ చిత్రానికి మైనస్ అయిందనే భావించాలి. లేకపోతే మరింత ఘనవిజయం సాధించే సత్తా 'గూడచారి'కి ఉందనే చెప్పాలి.