తెలుగులో ఉన్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది ప్రత్యేకశైలి. ఎందరు కొత్త దర్శకులు వచ్చినా ఆయన అభిరుచి, చిత్రీకరణ విషయంలో ఆయన పోటీ కాలేరని ఖచ్చితంగా చెప్పవచ్చు. 'గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి'ఇలా ఆయన ప్రతి చిత్రం ఎంతో అర్ధవంతంగా ఉంటుంది. ఇక 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి హిస్టారికల్ చిత్రాన్ని ఏమాత్రం సాంకేతికత తగ్గకుండా కేవలం 70రోజుల్లో తీయడం ఆయనకే చెల్లింది. ఆయన ప్రతిభను చూసే ఆయనకు బాలీవుడ్‌లో సైతం 'గబ్బర్ ఈజ్ బ్యాక్, మణికర్ణిక' వంటి ప్రెస్టీజియస్ చిత్రాలు వచ్చాయి. ఈయన చిత్రాలలో కనిపించే మరో గొప్పతనం ఏమిటంటే పర్‌ఫెక్ట్ క్యాస్టింగ్. ఏ పాత్రకు ఎవరు సూట్ అవుతారో కొలతలు వేసినట్లు అలాంటి వారినే ఎంచుకోవడంలోనే ఆయన ప్రతిభ దాగుంది.
ఇక విషయానికి వస్తే మొదట్లో తేజ మొదలు పెట్టిన 'ఎన్టీఆర్' బయోపిక్ బాధ్యతలను ఆయన తప్పుకున్నాక బాలయ్య క్రిష్ చేతిలో పెట్టాడు. ఇది ఒకందుకు మంచి జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి చిత్రాలను ఖచ్చితంగా కళాఖండాలుగా తీర్చిదిద్దగలిగే ప్రతిభా పాటవాలు ఆయన సొంతం. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన తన చిత్రాల విషయాలలో ఏమీ ఇంటర్‌ఫియర్ కాడనే పేరుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ఆయనకు చాలా కీలకమైన ప్రాజెక్ట్ కనుక ఈ చిత్రం నటీనటుల ఎంపికలో ఆయన కూడా శ్రద్ద వహిస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో తన తండ్రి ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ చేస్తుండగా, బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ చేస్తోంది. బసవతారకంగా విద్యాబాలన్ ఎంపిక 100కి 200శాతం పర్‌ఫెక్ట్ అని అందరు ఒప్పుకుంటున్నారు. ఇక ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రను దగ్గుబాటి రానా పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చిత్రంపై రానా తండ్రి సురేష్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా సెట్స్‌కి నేను వెళ్లాను. అక్కడ రానాను నేను గుర్తుపట్టలేకపోయాను. అక్కడ ఉన్నది చంద్రబాబునాయుడు కాదు రానా అని ఎవ్వరు చెప్పినా నమ్మరు. నాకు అక్కడ కేవలం చంద్రబాబే కనిపించాడు. స్టూడియోలో రానా అచ్చు చంద్రబాబులా స్టిల్స్ ఇస్తూ ఉన్నాడు. నేను అతడిని అసలు గుర్తుపట్టలేకపోయాను. ఈ చిత్రంలో రానా క్యారెక్టరైజేషన్ ఎంతో వైవిధ్యంగా ఉండబోతోంది.. అంటూ ఎన్టీఆర్ బయోపిక్‌పై మరింత అంచనాలు పెరిగేలా సురేష్‌బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. మరి ఇంతలా పర్‌ఫెక్ట్ క్యారెక్టర్లను తీసుకోవడం క్రిష్, బాలయ్యల మొదటి విజయమనే చెప్పాలి. అయితే ఈ క్రెడిట్ ఎక్కువగా ఎవరికి దక్కుతుంది? అనేది మాత్రం చిత్రం చూస్తే గానీ చెప్పలేం.