బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ చిత్రంలో ఆయన జోడీగా నటించే అవకాశం వస్తే ఎవ్వరూ కాదనరు. కానీ అలాంటి అవకాశాన్ని గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా మిస్ అయింది. దానికి కారణం ప్రియాంకా చోప్రాకు హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌తో జరిగిన నిశ్చితార్ధం త్వరలో వివాహం కారణంగానే ఈమె ఈ చిత్రం మిస్ అయిందట. అయినా హాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో ఉన్నా కూడా ప్రియాంకా సల్మాన్ చిత్రంలో నటించాలని ఇంతగా తాపత్రయపడటం చూస్తుంటే బాలీవుడ్ కండలవీరుడి క్రేజ్ అర్ధమవుతోంది.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ 'భారత్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రాను పెట్టుకోవాలని భావించారు. ఈ అవకాశాన్ని వదులుకునే విషయంలో ప్రియాంకా ఎంతో బాధపడిందట. ప్రియాంకాచోప్రా వదులుకోవడం సల్మాన్ మాజీ ప్రేయసి కత్రినాకైఫ్‌కి వరంగా మారింది. ఈ అవకాశాన్ని కత్రినా రెండు చేతుల్లా అందుకుంది. తాజాగా ఈ చిత్రంలో నటించకపోవడం పట్ల ప్రియంకా పడిన బాధను సల్మాన్‌గోవాలో జరిగిన ఓ వేడుకలో చెప్పుకొచ్చాడు. ప్రియాంకాకి 'భారత్' చిత్రం నుంచి తప్పుకోవడం ఎంతో కష్టమైంది. ఎందుకంటే ఆ చిత్రంలో నటించేందుకు ఆమె తన సోదరి అర్పితాకు దాదాపు వేయి సార్లు ఫోన్ చేసి ఉంటుంది. అలాగే దర్శకుడు అబ్బాస్‌కి కూడా ఫోన్ చేసి సినిమాలో చాన్స్ ఇవ్వమని కోరింది. కానీ నిశ్చితార్ధం, వివాహం కారణంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత ఎంతో బాధపడింది. ఆమె నిశ్చితార్ధం సమయంలో ఆమెని సినిమాలో నటింపజేయాలని నేను ఆమెకి నచ్చచెప్పాను. కానీ ఆమె తన సమస్యను నాకు పూర్తిగా చెప్పి ఎంతో బాధపడింది... అని చెప్పుకొచ్చాడు. మరి షష్టిపూర్తికి దగ్గర కాబోతున్న ఈ కలల రాకుమారుడంటే హీరోయిన్లకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి...!