దగ్గుబాటి రానా.. డి.రామానాయుడు మనవడిగా, సురేష్‌బాబు కుమారుడిగా, వెంకటేష్‌కి అబ్బాయ్‌గా ఈయన ఇప్పటికే నటునిగా కూడా తన సత్తా చాటుతున్నాడు. ఎవరి మనస్తత్వం ఏమిటి? ఎవరి అభిరుచి ఏమిటి? అనేవి వారు నటించే పాత్రలు, సినిమాలను బట్టి తెలుస్తాయి. ఈ విషయంలో రానా 'లీడర్, బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి' వంటి చిత్రాల ద్వారా తన అభిరుచిని చాటుకున్నాడు. ఇక ఈయన తన బాబాయ్ నటనా వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమే కాదు.. నిర్మాతగా తన తాత, తండ్రిల అభిరుచిని కూడా పుణికి పుచ్చుకున్నాడని తాజాగా అందరు కొత్త నటీనటులతో కొత్త దర్శకుడు వెంకట్ మహా దర్శకత్వంలో రూపొంది విడుదలైన 'కేరాఫ్ కంచరపాలెం' ద్వారా చాటుకున్నాడు. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు సినీ సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రేక్షకులు, వైవిధ్య చిత్రాలను అభిమానించే విశ్లేషకుల నుంచి మంచి ప్రశంసలు పొందుతున్నాడు. ఈ మధ్యన వచ్చిన అద్భుత చిత్రాలలో ఈ చిత్రం కూడా ఒకటని అందరు ముక్తకంఠంతో చెబుతున్నారు.
ఇక ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించిన రానా మీద రాజమౌళి నుంచి మహేష్‌బాబు వరకు అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రానాలోని అభిరుచిని అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక మెతుకు చూస్తే అర్ధమైనట్లు ఈ 'కేరాఫ్ కంచరపాలెం' నిరూపిస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఈ చిత్రం చూశాడు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ ద్వారా మహేష్ స్పందించాడు. క్లాస్‌కి దూరంగా ఉన్న చిత్రం ఇదని, నిజంగా ఇది డైరెక్టర్స్ ఫిల్మ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. పాత్రలను అద్భుతంగా మలిచారని, క్లైమాక్స్ ఈ చిత్రానికి గుండెకాయగా నిలిచిందన్నాడు. మొదటి చిత్రంతోనే ఇంత గొప్ప చిత్రం తీసిన దర్శకుడు వెంకటేష్ మహాకు శుభాకాంక్షలు తెలిపిన మహేష్, తనకు ఈ సినిమా ఎంతో బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. కొత్త నటీనటులతో నిర్మించినందుకు, ఇలాంటి కొత్త నైపుణ్యాన్ని ప్రోత్సహించిన దగ్గుబాటి రానాను చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు.
నిజంగానే ఒకే చిత్రం ద్వారా దాదాపు 50 మందికిపైగా కొత్త నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులను కూడా ప్రోత్సహించిన రానాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజమౌళి ఇందులో నటించిన అందరి దగ్గరికి వెళ్లి సెల్పీ దిగాలని ఉందని ఇప్పటికే ఈ చిత్రానికి మంచి ప్రమోషన్ ఇస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా బాగుంటే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినిమాను ప్రమోట్ చేస్తోన్న అందరి ప్రశంసనీయులేనని చెప్పాలి.