బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ తెలుగులో 'రక్తచరిత్ర' ద్వారా పరిటాల రవిగా అందరికీ సుపరిచితుడే. ఇక ఈయన ప్రస్తుతం బోయపాటి శ్రీను వంటి పవర్‌ఫుల్ డైరెక్టర్ దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, 'భరత్ అనే నేను' చిత్రం ఫేమ్ కైరా అద్వానీ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రంలో పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నాడు. తన చిత్రాలన్నిటిని ఎంతో పవర్‌ఫుల్‌గా తెరకెక్కించే బోయపాటి విలన్ల విషయంలో కూడా అంతే ఖచ్చితంగా ఉంటాడు. విలన్ ఎంత పవర్‌ఫుల్, ఆయన్ని మరెంత పవర్‌ఫుల్‌గా చూపిస్తే హీరోయిజం కూడా అంత హైలైట్ అవుతుందనే సిద్దాంతాన్ని బోయపాటి ఫాలో అవుతూ ఉంటాడు. ఇందులో ఎంతో వాస్తవం కూడా ఉంది. 'లెజెండ్' చిత్రంలో బాలయ్యకు ధీటుగా జగపతిబాబుని విలన్‌గా పరిచయం చేస్తూ ఫెరోషియస్‌గా చూపించి జగపతి బాబు ఇప్పుడు ఇండియాలోనే అత్యంత బిజీ ఆర్టిస్ట్‌గా మార్చడంతో బోయపాటి వంతు సాయం కూడా ఉంది.
ఇక 'సరైనోడు'లో ఆది పినిశెట్టి చేత కేకపెట్టించి. .. ఆదిపినిశెట్టిని కూడా ఎంతో బిజీగా చేసిన ఘనత బోయపాటిదే. ఇక తన తాజా చిత్రం రామ్‌చరణ్ మూవీతో ఆయన వివేక్ ఒబేరాయ్‌ని ఎంతో పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నాడట. ఈ చిత్రం ఎంతో పవర్‌ఫుల్‌గానే కాకుండా ప్రశాంత్, స్నేహ, ఆర్యన్‌రాజేష్ వంటి అన్న వదినల సెంటిమెంట్‌తో అద్భుతంగా ఉంటోందని అంటున్నారు. కాగా ప్రస్తుతం బోయపాటి ఈ చిత్రంలోని ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ కోసం అజర్‌బైజాన్‌కి వెళ్లాడు. అక్కడ రామ్‌చరణ్, వివేక్ ఒబేరాయ్‌లపై ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఇందులో విలన్‌గా నటిస్తోన్న వివేక్ ఒబేరాయ్ స్పందించాడు. అజర్‌బైజాన్ దేశం అంటేనే పౌరుషత్వానికి ప్రతీక.
అలాంటి దేశంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతూ ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. మాస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను టేకింగ్ అద్భుతంగా ఉంది. అద్భుతమైన టాలెంట్ చరణ్ సొంతం. ఆయనతో కలిసి నటించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే సీట్ ఎడ్జ్‌పై కూర్చుని ఎంజాయ్ చేయవలసిన చిత్రం ఇది. ఎదురు చూస్తూ ఉండండి.. అని ట్వీట్ చేశాడు. లోకేషన్‌లోని ఫొటోని కూడా ఆయన షేర్ చేయడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'భరత్ అనే నేను', తర్వాత రామ్‌చరణ్‌తో ఈ చిత్రం చేస్తోన్న నిర్మాత డివివి దానయ్య దీని తదుపరి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్‌గా నిర్మించనుండటంతో దానయ్యకి హ్యాట్రిక్ ఖామయని చెప్పవచ్చు.