ఆగిపోయిన గడియారం కూడా రోజుకి రెండు సార్లు సరైన సమయాన్ని సూచిస్తుందనేది ఆశావాద దృక్పథం ఉన్న వారి ఆలోచనా విధానం. ఇక ఫ్లాప్ చిత్రాలలో కూడా తమదైన శైలిలో తమకు ఎంతో సంతృప్తి నిచ్చాయని చెప్పడం నేటి మాటల మాంత్రికులు విశ్లేషించే విధానం, ఇటు బుల్లితెర మీద అటు వెండితెర మీద కూడా రాణిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న అనసూయది కూడా పాజిటివ్ థింకింగ్ మైండా? లేక అపజయంలో కూడా తనదైన మంచిని వెతుక్కుంటూ తన మాటల గారడీతో మాయలు చేసే తీరా? అనేది ఆలోచించాల్సిన విషయం కారణం ఏమిటంటే.. ఆమె నటించిన చిత్రాలలో 'క్షణం, రంగస్థలం' చిత్రాలు ఆమెకి మంచి పేరును తీసుకుని వచ్చి, చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. అదే ఆమె ఐటం సాంగ్ చేసిన 'విన్నర్', మోహన్‌బాబు ఎన్నో ఆశలతో చేసినా కూడా విజయం సాధించలేకపోయిన 'గాయత్రి' చిత్రాలు ఆమె కెరీర్‌లో ఫ్లాప్స్‌గా ముద్రపడ్డాయి.
కానీ ఈ తెలివైన అమ్మడు మాత్రం ఈ రెండు చిత్రాలు కూడా తనకెంతో సంతృప్తిని ఇచ్చాయని చెబుతోంది. 'విన్నర్' చిత్రం బాగా ఆడి ఉండకపోవచ్చు. కానీ ఆ చిత్రంలో కేవలం కొద్ది పాటి కెరీర్‌లోనే ఏకంగా నా పేరు మీద 'సూయ.. సూయ... అనసూయ' అనే పాటను రాశారంటే అంతకు మించిన ఆనందం ఇక నాకేం ఉంటుంది? కాబట్టి 'విన్నర్' చిత్రం నా జీవితంలో మరచిపోలేని అనుభూతిని అందించిన చిత్రమే. ఇక 'గాయత్రి' చిత్రం కూడా సరిగా ఆడకపోయి ఉండవచ్చు. కానీ అందులో మోహన్‌బాబు గారితో నటించడం, నా నటనకు ప్రశంసలు లభించడం వల్ల ఆ చిత్రం కూడా నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చిన చిత్రంగానే భావిస్తాను అని చెప్పుకొచ్చింది ఈ అనసూయ ఆంటీ.
ప్రస్తుతం ఈమెకి ఉన్న క్రేజ్ దృష్ట్యా దర్శకనిర్మాతలు కూడా ఈమెకి తమ తమ చిత్రాలలో ప్రత్యేక పాత్రలు ఉండేలా చూసుకుంటున్నారనేది మాత్రం వాస్తవమేనని చెప్పాలి. ఈ విషయంలో రేష్మి కంటే అనసూయ క్రేజ్ పరంగా ఓ అడుగు ముందే ఉందని ఒప్పుకోవాలి.