పరుచూరి బ్రదర్స్ ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో పెంచిన పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు రఘుబాబు. రఘుబాబుని హీరోని చేయాలని పరుచూరి బ్రదర్స్ కలలుగన్నారు. కానీ ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో ఎంతో చిన్న వయసులోనే మరణించాడు. ఆయన పేరుపై ఇప్పటికీ పరుచూరి బ్రదర్స్ నాటక సంఘ అవార్డులను ఇస్తూ వస్తున్నారు. ఇక పరుచూరి వెంకటేశ్వరరావుకి మరణించిన తన కుమారుడంటే ఎంత ఇష్టమో ఒక్క మాటలో చెప్పవచ్చు. పరుచూరి వెంకటేశ్వరరావుకి సిగరెట్ తాగే అలవాటు ఉండేది. దాంతో చిరంజీవి ఓ సారి మీ కుమారుడిని పోగొట్టుకున్నారు. అతనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీ మరణించిన కుమారుడి కోసం సిగరెట్టు తాగడం ఆపివేయకూడదా? అని అడగడం, ఆ క్షణం నుంచి ఆయన సిగరెట్లు తాగడం ఆపివేశారు.
ఇక విషయానికి వస్తే తాజాగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, తనని బాధించే ఓ విషయం గురించి చెప్పుకొచ్చారు. 1989లో మా అన్నయ్య గారి రెండో అబ్బాయికి బ్లడ్‌క్యాన్సర్ వచ్చింది. అపోలో హాస్పిటల్‌లో చికిత్స చేయించి తీసుకుని వచ్చాం. ఆ కుర్రాడి రూంలోకి నెల రోజుల పాటు ఎవ్వరూ పోవద్దని, అలా చేయడం వల్ల రోగం తిరగబెట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. ఆ విషయాన్ని నేను సెట్లో రావుగోపాలరావుగారికి చెప్పాను. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రాజుగారికి ఇలాంటి క్యాన్సర్ వచ్చినప్పుడు కేరళలోని ఫలానా చోటుకి తీసుకెళ్లి వైద్యం చేయించారని, ఆ తర్వాత ఆయన 36ఏళ్ల పాటు బతికాడని, అక్కడికి తీసుకెళ్లమని రావుగోపాలరావు గారు మాకు చెప్పారు. వెంటనే వెళ్లి మా అన్నయ్య, వదినలకు ఈ విషయం చెప్పాను.
ఏమి జరుగుతుందో అనే భయంతో మా వదిన వద్దంది. ఆ తర్వాత ఆ బిడ్డ లేడు. మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. మా బిడ్డను బతికించుకోవడం కోసం ఓ మంచి మాటను రావుగోపాలరావు చెప్పారు. అది వినిపించుకోలేదనే బాధ మాకు ఇప్పటికీ ఉంది అంటూ ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.