ఒక హీరోకి ఒకే ఒక్క చిత్రంతో స్టార్‌డమ్, క్రేజ్ వస్తే చాలు అతని పాత చిత్రాలను తాజాగా డబ్బింగ్ చేయడం, లేదా గతంలో ఆగిపోయిన చిత్రాలను ఎలాగోలా పూర్తి చేసి విడుదల చేసి ఆ హీరోకి వచ్చిన క్రేజ్‌ని సొంతం చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలోనే సందీప్‌కిషన్ నటించిన తమిళ చిత్రం 'మాయావన్' చిత్రాన్ని తెలుగులో తమ అనుమతి లేకుండా 'ప్రాజెక్ట్ జడ్' పేరుతో తెలుగులో విడుదల చేశారని దర్శక నిర్మాతలు, హీరో సందీప్‌కిషన్‌లు రోడ్డుకి ఎక్కారు. మరోవైపు 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి'తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నటించిన 'ద్వారకా, ఏ మంత్రం వేశావే' చిత్రాల విషయంలో కూడా ఇదే జరిగింది.
ఇక తాజాగా విషయానికి వస్తే అజయ్ భూపతి దర్శకత్వంలో రా చిత్రంగా రూపొందిన 'ఆర్‌ఎక్స్100' చిత్రం 'అర్జున్‌రెడ్డి'రేంజ్‌లో కాకపోయినా పెద్ద విజయమే సాధించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన కార్తికేయకి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు కార్తికేయ నటించాడని చెబుతున్న 'సుపారి' అనే చిత్రం విషయంలో నిర్మాత, హీరోల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. ఈ చిత్రంలో తాను నటించాలని భావించానని, తనపై డెమో కూడా షూట్ చేసిన విషయం వాస్తవమేనని, ఆ చిత్రంలో నేను నటించలేదు. డెమో కోసం తీసిన వాటిని సినిమా కోసం వాడుకున్నారు. ఇప్పుడు నాకున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు అంటూ కార్తికేయ తన వాదన వినిపిస్తున్నాడు. కానీ చిత్రం యూనిట్ మాత్రం 'సుపారీ' చిత్రంలో కార్తికేయ నటించాడు. ఆయన పార్ట్ షూటింగ్ కూడా పూర్తయింది. ఆయన సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పాడు.. అని ఆరోపిస్తున్నారు.
దీనిని బట్టి చూస్తే 'ఆర్‌ఎక్స్100'తో తనకు వచ్చిన క్రేజ్ అంతకు ముందే ఒప్పుకున్న 'సుపారీ' విడుదల కావడం వల్ల దెబ్బతింటుందని కార్తికేయ ఉద్దేశ్యంగా అనిపిస్తూ ఉంటే, నిర్మాతలు ఈ చిత్రం బూచిని చూపి రిలీజ్ చేయకుండా ఆపాలంటే కొంత డబ్బును కార్తికేయ నుంచి డిమాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు డబ్బింగ్ కూడా చెప్పాడని నిర్మాతలు ప్రకించడం చూస్తే ఇది పెద్ద గేమ్‌లా అనిపించకమానదు.