పూనమ్‌కౌర్.. ఈమె తాను నటించిన చిత్రాలు, పాత్రల ద్వారా కంటే పలు వివాదాల ద్వారానే నిత్యం వార్తల్లో ఉంటూ వస్తోంది. కాస్టింగ్‌కౌచ్ నుంచి పవన్, కత్తిమహేష్ వివాదంలో కూడా ఈమె తలదూర్చింది. 'మాయాజాలం, ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, నాగవల్లి, గగనం' వంటి పలు చిత్రాలలో నటించింది. ఇటీవల వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం'తో పాటు ప్రస్తుతం బుల్లితెర మీద వస్తున్న చారిత్రాత్మక నేపధ్యం తరహాలో సాగుతున్న 'స్వర్ణఖడ్గం' సీరియల్‌లో నటిస్తోంది.
తాజాగా ఆమె నేను తప్పు చేయకపోయినా తనను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చింది. కృష్ణాష్టమి కానుకగా తాను ఓ వీడియోను విడుదల చేయనున్నానని ఆమె గతంలో తెలిపింది. చాలా సంతృప్తిగా, సంతోషంతో, మనస్ఫూర్తిగా చేసిన వీడియో ఇది అని ఆమె పేర్కొంది. 'పీకే లవ్' అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా జత చేసింది. అయితే నెటిజన్ల నుంచి ఆమెకి వ్యతిరేకంగా వివిధ రకాలైన కామెంట్స్ వచ్చాయి. దీనిపై బాధ పడ్డ ఆమె తాజాగా దానిపై స్పందించింది.
నేను ఎంతకష్టపడ్డాను? ఎంత నిజాయితీగా, ఎంత చక్కగా పనిచేశాను అనేది ఇక్కడ ముఖ్యం కాదు. నా తప్పు లేకపోయినా నన్ను తిడుతూ అనవసరంగా విమర్శిస్తున్నారు. నన్ను నిందిస్తున్నారు. నా హృదయానికి చేరువైన ఈ వీడియోను నేను విడుదల చేయదలుచుకోవడం లేదు అని వివరించింది. ఇదేదో చెరువు మీద అలిగి.. అనే మోటు సామెతలా ఉందని అనిపిస్తోంది కదూ..!