ఎవరు నమ్మినా నమ్మకపోయినా కూడా విధిరాతని తప్పించడం ఎవరి వల్లాకాదు. దేవుడిని నమ్మం అనే వారు కూడా టైంని నమ్ముతాం అంటారు. దేవుడు పిలుస్తుంటే మన చర్యలు, మనం చేసే పనులు, మన మాటలు అన్ని అలాగే వస్తూ ఉంటాయి. ఇక తాజాగా హరికృష్ణ కారు ప్రమాద దుర్ఘటనలో అశువులు బాసిన సంగతి తెలిసిందే. ఆయన పెద్దకుమారుడు జానకీరాం ఆ రహదారిపైనే మరణిస్తే, ఎన్టీఆర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు హరికృష్ణ అదే విజయవాడకి వెళ్లే హైవేపై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇది యాదృచ్చికం అని కూడా అనుకోలేం. ఇక వాహనాలు, హెవీ వాహనాలను సైతం అత్యంతవేగంగా, సురక్షితంగా నడపడంలో హరికృష్ణకి తిరుగులేదు. అందరికీ వాహన ప్రయాణాలలో సురక్షితంగా ఉండాలని పదే పదే చెప్పే హరికృష్ణ చివరకు అంత గొప్ప డ్రైవర్ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించడం విధి విచిత్రం కాక మరేమిటి? ఆయన జీవితంలో ఆయనకు సీటు బెల్ట్ పెట్టుకునే అలవాటే లేదని ఆయన సన్నిహితులు చెప్పడం చూస్తే బాధేయకమానదు.
తాజాగా హరికృష్ణ జయంతి సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ హరికృష్ణని తల్చుకుని భావోద్వేగాలకు లోనవుతూ ఆయన చెప్పిన ఆసక్తికర సంభాషణ వింటే విధి హరికృష్ణ చేత అలా మాట్లాడించిందా? అనిపిస్తుంది. తాజాగా పరుచూరి మాట్లాడుతూ, మమ్మల్మి ఎన్టీఆర్ గారు రచయితలుగా పరిచయం చేసే సమయంలో మమ్మల్ని సినీ ఫీల్డ్‌కి ఉయ్యూరు నుంచి కారులో తీసుకుని వెళ్లింది హరికృష్ణనే. పరిచయం అయిన తొలినాళ్లలో పరుచూరి గోపాలకృష్ణ అని పూర్తిగా పేరు పిలవడానకి ఇబ్బంది పడి పగో అని పిలుస్తాను మీకు ఏమి అభ్యంతరం లేదు కదా...! అని అడిగారు. అప్పటి నుంచి ఆయన అలాగే పిలుస్తూ ఉండేవారు. నేను ఆగష్టు27న హరికృష్ణకి ఫోన్ చేసి 30 వ తేదీన నా మనవరాలి పెళ్లి. మీరు వచ్చి అక్షింతలు వేస్తే అన్నగారే వచ్చి ఆశీర్వదించినట్టుగా భావిస్తాను అని చెప్పాను. 'సారీ.. రాలేను. ఒకతనికి మాట ఇచ్చాను. 29 ఉదయమే కావలి వెళ్తున్నాను. 30వ తేదీ కల్లా ఇక్కడికి రాగలుగుతానో లేదో చెప్పలేను. అని సమాధానం ఇచ్చారు. పోనీ 31వ తేదీన సత్యన్నారాయణ వ్రతానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించు అని అడిగాను. 'రాలేను' అన్నారు. ఆ 'రాలేను' అనే పదం ఆయన నోటి నుంచి ఎప్పుడు వినలేదు. మొదటిసారిగా వాటిని ఆయన నుంచి విన్నాను. పోనీ ఒక పని చేస్తావా హరి...! ఆగష్టు 27వ తేదీ ఉదయం 11.30కి పెళ్లికూతురిని చేస్తున్నాం. వచ్చి అక్షింతలు వేస్తావా? అంటే సరేనన్నాడు.
ఆ సమయంలో మేము పెళ్లికొడుకు వద్దకు వెళ్లాం. ఆరోజు మేము లేని సమయంలో వచ్చి 11గంటల కల్లా అక్షింతలు వేసి బయలుదేరబోతూ ఉంటే.. 'నాన్నగారు వస్తారు .. కాస్త ఉండండి అని మా అమ్మాయి అంటే 'వెళ్లానని చెప్పండి' అనడంతో నేనే హరికృష్ణకి ఫోన్ చేసి రెండు నిమిషాలలో వస్తాం. ఆగండి హరి అంటే లేదు.. టైం లేదు.. నేను వెళ్లిపోతున్నా' అన్నారు. ఇది తను నాతో మాట్లాడిన చివరి మాటలు. తండ్రిని కోల్పోయిన ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లకు, అన్నని కోల్పోయిన బాలకృష్ణకు దేవుడు మనస్థైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని పరుచూరి గోపాలకృష్ణ ఉద్వేగంతో చెప్పుకొచ్చారు.