కేవలం ఒకే ఒక్క సినిమా 'ఆనందోబ్రహ్మ' అనుభవం మాత్రమే ఉన్న దర్శకుడు మహి.వి.రాఘవ మొదట వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రపై 'యాత్ర' అనే బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నాడని వార్తలు వచ్చినప్పుడు పెద్దగా స్పందన లేదు. కానీ ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగా మమ్ముట్టి అదిరిపోయే గెటప్‌తో కనిపిస్తూ ఉండటంతో మమ్ముట్టి చిత్రాల ఎంపిక, ఆయన నటనా సత్తా తెలిసిన అందరికి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 2వ తేదీకి తెలుగు నేలపై మంచి చరిత్రే ఉంది. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన పవన్‌కళ్యాణ్ జన్మదినోత్సవం, తాజాగా హఠాన్మరణం చెందిన హరికృష్ణ పుట్టినరోజు కూడా ఈరోజే కావడంతో పాటు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తొమ్మిదేళ్ల ముందు ఈ రోజునే మరణించడంతో ఈ తేదీకి మంచి ప్రాముఖ్యత ఏర్పడింది.
మరో విశేషం ఏమిటంటే.. నాగచైతన్య నటించిన మొదటి చిత్రం 'జోష్' చిత్రం ఇదే రోజున విడుదలకు సిద్దమై రాజశేఖర్‌రెడ్డి మరణం వల్ల పోస్ట్‌పోన్ అయింది. ఇక తాజా విషయానికి వస్తే మమ్ముట్టి నటిస్తున్న 'యాత్ర' చిత్రంలోని లిరిక్ సాంగ్‌ని తాజాగా వైఎస్ 9వ వర్దంతి సందర్భంగా విడుదల చేశారు. 'సమరశంఖం' అంటూ సాగే ఈ సాంగ్‌లో వేలాది మంది వెంటరాగా, మహానేత పాదయాత్రగా ప్రజాక్షేత్రంలోకి వడివడిగా వెళ్తున్న దృశ్యాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. 'నీ కన్నుల్లో కొలిమై రగిలే..కలెదో నిజమై తెలవారెనే..వెతికే వెలుగే రాని..ఈనాటి సుప్రభాత గీతమే.. నీకిదే అన్నది స్వాగతం..' అంటూ సాగిన ఈ పాట ఆనాటి చారిత్రాత్మక పాదయాత్రను కళ్లకు కట్టేలా ఉంది.
ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తూ వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ లిరికల్ సాంగ్, మమ్ముట్టి గెటప్, వైఎస్ తరహాలో ఆయన కనిపిస్తూ అభివాదం చేస్తుండటం చూస్తుంటే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయనే చెప్పాలి.