గతంలో స్వర్గీయ ఎన్టీఆర్, లక్ష్మిపార్వతిని రెండో వివాహం చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అల్లుళ్లు అందరు ఒకటయ్యారు. ఇక ఇప్పుడు నందమూరి హరికృష్ణ మరణం కూడా రాజకీయ సమీకరణాలలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతోందని పలువురు విశ్లేషిస్తున్నారు. గత కొంతకాలంలో చంద్రబాబునాయుడు, బాలకృష్ణలకు జూనియర్ ఎన్టీఆర్ అంటే పడటం లేదని వార్తలు వస్తూ ఉన్నాయి. వారి బిహేవియర్ చూసినా, వేడుకల సమయంలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తూనే వచ్చింది.
ఇక బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌గా 'ఎన్టీఆర్' చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి కూడా జూనియర్ ఎన్టీఆర్‌ని పిలవలేదు. బాబాయ్.. బాబాయ్ అంటూ ఆప్యాయంగా ఉంటూ ఉండే ఎన్టీఆర్ ఆమధ్య మీడియాతో మాట్లాడుతూ కూడా 'ఎన్టీఆర్' చిత్రంలో తనని నటించమని ఎవ్వరూ కోరలేదని చెప్పుకొచ్చాడు. మరోవైపు హరికృష్ణ పాత్రను మాత్రం నందమూరి కళ్యాణ్‌రామ్ పోషిస్తున్నాడని తెలిసిందే. ఇక విషయానికి వస్తే హరికృష్ణ మరణం తర్వాత ఆయన బావమరిది అయిన చంద్రబాబు నాయుడు హరికృష్ణ పాడెను మోశాడు. ఇక తాజాగా హరికృష్ణ నివాసంలో పలువురు ప్రముఖులు భోజనం చేస్తున్న సందర్భంగా ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు కూడా భోజనం చేశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌తో ఏదో విషయం గురించి చర్చిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
బాలయ్య బాబాయ్ చెప్పే మాటలను యంగ్‌టైగర్ కూడా ఎంతో వినయంగా వింటూ ఉన్నాడు. బహుశా నందమూరి కుటుంబంలోని విబేధాలన్నీ సమసిపోయి అందరూ మరలా ఒకటిగా కలిసి కట్టుగా ఉండేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాంతో నందమూరి అభిమానులు కూడా తామంతా ఒక్కటే అని అంటున్నారు. ఇక హరికృష్ణ మరణం సమయంలో హాస్పిటల్ రూంలో చంద్రబాబుకి అటు ఇటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కూర్చోవడం, చంద్రబాబు జూనియర్‌కి ఏదో చెబుతున్న వీడియో కూడా బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.