మన సినిమా వారు ఫలానా చిత్రాలను కొన్నివర్గాలు మెచ్చవు. మాస్‌కి ఎక్కాలంటే కొన్నితరహా కథలే చేయాలి. లేదా మరో వర్గం వారికి నచ్చాలంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ని చూపించాలి. ఫలానా తరహా చిత్రాలే ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాయి అంటూ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈమధ్యకాలంలో సినిమాలకు పోషకులుగా ఉన్న యూత్‌ని టార్గెట్ చేస్తున్నారు. కానీ సరైన కంటెంట్ ఉండాలే గానీ క్లాస్ చిత్రమైనా, మాస్ చిత్రమైనా కూడా అందరినీ ఆకట్టుకోవచ్చని 'రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం, ఫిదా'వంటి చిత్రాలు నిరూపిస్తూనే ఉన్నాయి.
ఇక విషయానికి వస్తే మహానటి సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' చిత్రం ప్రారంభించినప్పుడు అందునా పెద్దగా దర్శకత్వ అనుభవం లేని ఒకే ఒక్క చిత్రం అనుభవం ఉన్న నాగ్ అశ్విన్, మహానటి పాత్రలో కీర్తిసురేష్‌ని ఎంచుకున్నప్పుడు ఇది కేవలం సావిత్రి క్రేజ్‌ను సొమ్ము చేసుకోనే ప్రయత్నమే తప్ప మరోటి కాదని ఎందరో పెదవులు విరిచారు. కానీ ఈ చిత్రం తెలుగులో బయోపిక్స్‌కి ఓ కొత్త ట్రెండ్ సృష్టించి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మీడియం బడ్జెట్‌లో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా వీరవిహారం చేసింది.
ఇక ఓవర్‌సీస్‌లోనూ ఓ ఊపు ఊపింది. రాబోయే టాలీవుడ్ బయోపిక్స్‌కి కొలమానంగా నిలిచింది. ఈ సినిమాను స్టార్ మా చానెల్ తాజాగా ప్రసారం చేసింది. రేటింగ్ పరంగా కూడా ఈ చిత్రం అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ ఏకంగా 20. 16టీర్పీని సాధించి తన సత్తాను చాటింది. మరోవైపు డిజిటల్ మీడియాలో కూడా ఈ చిత్రం బాగా వసూళ్లు సాధిస్తోంది. దీనిని బట్టి మంచి చిత్రం, కంటెంట్ ఉన్న చిత్రం అయితే అది వెండితెర మీదైనా, బుల్లితెర మీదైనా, లేదా డిజిటల్ పరంగా కూడా రాణించడం ఖాయమని ఈ చిత్రం మరోసారి నిరూపించిందనే చెప్పాలి.