తాజాగా నందమూరి కుటుంబం మొత్తం బాలయ్య సోదరుడు నందమూరి హరికృష్ణ మరణంతో తీవ్ర విషాదంలో ఉంది. అయితే అనుకోకుండా ఈ దుర్ఘటన జరగడానికి ముందు బాలయ్య మెగాస్టార్ చిరంజీవిని ‘సైరా....నరసింహారెడ్డి’ షూటింగ్‌లో కలిశాడు. మాస్ ఫాలోయింగ్, ఇమేజ్, చిత్రాల హిట్స్ రీత్యా బాక్సాఫీస్ వద్ద కోడిపుంజుల్లా రెచ్చిపోయే ఈ టాలీవుడ్ నెంబర్‌వన్, నెంబర్‌టూలు వ్యక్తిగతంగా మాత్రం ఎంతో మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. గతంలో చాలా సార్లు బాలయ్య ఇండస్ట్రీలో తనకు ఉన్న అత్యంత ముఖ్యమైన స్నేహితులలో చిరంజీవి ఒకరని చెప్పారు. వీరిద్దరు పలు సినిమా వేడుకల్లోనే గాక వ్యక్తిగత, కుటుంబ వేడుకల్లో కూడా ఆడి పాడి ఉన్నారు.
ఇక ‘సైరా’ చిత్రం షూటింగ్ సందర్భంగా బాలయ్య షూటింగ్ స్పాట్‌కి విచ్చేయడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. బహుశా మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే హంగామా ముగిసిన తర్వాత తన స్నేహితునికి శుభాకాంక్షలు చెప్పేందుకే బాలయ్య.. మెగాస్టార్ చిరంజీవి సెట్స్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. చిరంజీవిని, చిత్ర టీమ్‌ని అభినందించిన బాలయ్య ఈ చిత్రం బాగా రావాలని ఆకాక్షించినట్లు సమాచారం. వీరిద్దరు సెట్‌లో చాలా సేపు ముచ్చట్లాడుతూ కూర్చున్నారని తెలుస్తోంది. ఈ కలయికకు చెందిన ఫొటోలు మాత్రం బయటకు రాలేదు. ఇక సైరా సెట్‌కి పవన్‌కళ్యాణ్ వెళ్లినప్పుడు తీసిన పలు ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే.
ఇక భారతజాతిని ఏకం చేసి తెలుగు పౌరుషాన్ని చాటిన ‘గౌతమీ పుత్రశాతకర్ణి’గా బాలయ్య మెప్పించగా, ఇప్పుడు తొలి తెలుగు స్వాతంత్య్రసమరయోధుని పాత్రలో చిరంజీవి ఉయ్యాల వాడ నరసింహారెడ్డిగా ‘సై..రా..నరసింహారెడ్డి’ అంటూ వస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘సై.రా’ టీజర్‌ని చూసి బాలయ్య అభిమానులు కూడా తమ హీరోలా చిరంజీవి కనిపిస్తున్నాడంటూ ట్రోలింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.