టాలీవుడ్‌లో ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ వరకు, నాగార్జున నుంచి అల్లరినరేష్ వరకు, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ నుంచి దాసరి నారాయణరావు వరకు, చంద్రబాబు నుంచి జగన్ వరకు, తమిళనాట రజనీకాంత్ నుంచి స్టాలిన్ వరకు, పరిటాల రవి నుంచి ప్రతి ఒక్కరితో సన్నిహిత సంబంధాలు ఉన్న నటుడు మోహన్‌బాబు. ఒకే ఒరలో ఇమడని వ్యక్తులతో కూడా ఆయన వంతుల వారీగా స్నేహం చేస్తూ ఉంటారు. ఇలా బడా బడా వ్యక్తులతో స్నేహాలే ఆయన పెట్టుబడి అని చెప్పాలి. ఇక దాసరికి ప్రియశిష్యుడు అనిపించుకున్నా, ఎన్టీఆర్‌తో పట్టుబట్టి ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా తీసినా, ఎన్టీఆర్-లక్ష్మీపార్వతిల వివాహానికి తనవంతు సాయం చేసినా, చంద్రబాబును పక్కనపెట్టి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డితో చుట్టరికం కలుపుకున్నా, జగన్‌కి నేనున్నాను అంటూ అభయమిచ్చినా, పెదరాయుడు చిత్రాన్ని స్వయంగా రజనీకాంత్ మోహన్‌బాబుకి రీమేక్ చేయమని చెప్పి రైట్స్ ఇప్పించినా, అందులో రజనీకాంత్ చేతనే ఓ పాత్ర చేయించి సినిమాకి క్రేజ్ తీసుకుని వచ్చినా కూడా అది మోహన్‌బాబుకే సాధ్యమని చెప్పాలి.
ఇక నిన్నటివరకు రజనీకాంత్ మోహన్‌బాబుకి ఎంతో సన్నిహితుడు కావడంతో రజనీని రాజకీయంగా బలపరుస్తాడని, ఆయనకు తన మద్దతు ఇస్తాడని అందరు భావించారు. ఇదే రజనీకాంత్ ఒకానొక సందర్భంలో తాను ఫిల్మ్‌నగర్‌లో స్థలాలు కొనాలని భావిస్తే మోహన్‌బాబే అడ్డుపుల్ల వేశాడని చెప్పాడు. మరి మోహన్‌బాబు తన ప్రాణస్నేహితుడైన రజనీని కాదని, తాజాగా కరుణానిధి సంస్మరణసభ కోయంబత్తూరులో జరిగిన సందర్భంగా స్టాలిన్ ఆహ్వానంపై ఆ వేడుకకు హాజరయ్యాడు. అంతే కాదు.. మిస్టర్ స్టాలిన్.. నిన్ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది అంటూ ట్వీట్ చేశాడు.
ఈ సంస్మరణ సభకు తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. కరుణ అద్భుతమైన లెజెండరీ ఫాదర్ అని కితాబునిచ్చాడు. కరుణానిధితో ఆయన కుటుంబంతో మోహన్‌బాబుకి ఎంతో పరిచయం ఉంది. తమిళనాడులో తెలుగు ఇండస్ట్రీ ఉన్నప్పటి నుంచి కరుణతో సత్సంబంధాలు ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్‌కి షిప్ట్ అయిన తర్వాత కూడా ఆయన అవే సంబంధాలను మెయిన్‌టెయిన్ చేశాడు. మోహన్‌బాబు సినిమా కార్యక్రమాలకు కూడా కరుణ హాజరైన ఉదంతాలు ఉండటం విశేషం.