ఇటీవల కాలంలో బోల్డ్ కంటెంట్‌తో అతి చిన్న బడ్జెట్ చిత్రంగా వచ్చి ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా యూత్‌ని ఎంతో ఆకట్టుకుని రూపాయికి పదిరూపాయల ఆదాయాన్ని సాధించిన చిత్రం 'ఆర్‌ఎక్స్ 100'. ఈ చిత్రం ద్వారా రాంగోపాల్‌వర్మ శిష్యుడు అజయ్‌భూపతి దర్శకునిగా పరిచయం అయ్యాడు. ఇక విషయానికి వస్తే ఈ సంచలన దర్శకుడు తాజాగా ఓ ఇంటి వాడయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంకి చెందిన శిరీషతో అజయ్ వివాహం అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లో జరిగింది.
ఈ వివాహ వేడుకకు హాజరైన 'ఆర్‌ఎక్స్ 100' హీరో కార్తికేయ వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపాడు. అజయ్ భూపతి-శిరీషలకి సంబంధించిన పెళ్లి ఫొటోను ఆయన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 'నా బాస్ అజయ్ భూపతికి బాస్ వచ్చేశారు. శుభాకాంక్షలు సర్' అని ట్వీట్ చేశాడు. తాను రెండేళ్ల కిందటే శిరీషకి ప్రపోజ్ చేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో అజయ్ భూపతి చెప్పాడు. తమ ప్రేమకి శిరీష ఒప్పుకున్నా కూడా ఆమె ఇంట్లోని వారు ఒప్పుకోలేదని, కెరీర్, జీవితంలో సెటిల్ కాకపోవడమే దానికి కారణమని ఆయన చెప్పుకొచ్చాడు. దాంతో తనకు రెండేళ్లు సమయం ఇస్తే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకుంటానని తన అత్తామామలకు సవాల్ విసిరి వచ్చానని, చెప్పినట్లుగానే 'ఆర్‌ఎక్స్ 100'తో సూపర్‌హిట్ కొట్టడంతో వారు తమ పెళ్లికి ఒకే చెప్పారని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
కాగా వధూవరులిద్దరిదీ తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురమే కావడం విశేషం. ఇక 'ఆర్‌ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతికి పలువురు నిర్మాతలు, హీరోల నుంచి మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. మరి ఈయన చేయబోయే రెండో చిత్రం ఏమిటి? దీని ద్వారా ఆయన ద్వితీయ విఘ్నాన్ని అధిగమిస్తాడా? లేదా? అనేవి ఎదురుచూడాల్సివుంది. మొత్తానికి ఎంతో కాలానికి వర్మ మరో శిష్యుడు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారడం విశేషం.