మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. అందుకే రాజకీయనాయకుల నుంచి అందరు సెలబ్రిటీలు కూడా చిరు తమ వేడుకలకు రావాలని భావిస్తూ ఉంటారు. తాజాగా ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా మెగాస్టార్‌చిరంజీవిని కలిసి వివాహానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవిపై అభిమానంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉన్నత వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి కోవకి చెందిన అభిమాని కొంతం ప్రసాద్. ఈయన తూర్పుగోదావరి జిల్లా మండపేటకి చెందిన వాడు. గత 20ఏళ్లుగా చిరంజీవి పేరుతో ఎన్నోసేవా కార్యక్రమాలను నిర్వహించాడు.
చిరంజీవికి వీరాభిమాని అయిన ఈయనకు 2017 ఆగష్టు22న ఏ పాప జన్మించింది. తాను ఎంతగానో అభిమానించే చిరంజీవి పుట్టినరోజు నాడే తనకి పాప పుట్టడంతో ఆ పాపకు చిరంజీవి చేతుల మీదుగా నామకరణం చేయించాలని ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఎట్టకేలకు ఆయనకు మెగాస్టార్ చిరంజీవి నుంచి పిలుపువచ్చింది. దాంతో తన భార్యాబిడ్డలతో కలిసి ఆయన చిరంజీవిని కలుసుకున్నాడు. చిరంజీవి ఆ పాపకు 'అరుషి' అని నామకరణం చేసి తన ఆశీస్సులు అందించారు.
తమ అభిమాన హీరో చిరంజీవి చేతుల మీదుగా తమ పాపకు నామకరణం జరగడంతో ఆ దంపతులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారు చిరంజీవి పెద్ద మనసుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నారు. మొత్తానికి చిరంజీవి రాజకీయంగా అందరి వాడు కాలేకపోయినా కూడా నటునిగా మాత్రం తాను అందరివాడినని మరోసారి నిరూపించుకున్నాడనే చెప్పాలి.