ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా, యాక్షన్ హీరోగా కూడా అందరినీ అలరించిన నటుడు జగపతిబాబు. ఈయన ఎంతో మంచి మనిషి. ప్రతి విషయంలోనూ అందరినీ గుడ్డిగా నమ్మెస్తూ ఉంటాడు. డబ్బు కన్నా స్నేహం గొప్పదని ఈయన భావిస్తారు. ఆ విషయంలో కోలీవుడ్ స్టార్స్ అయిన యాక్షన్‌కింగ్ అర్జున్, రజనీకాంత్ వంటి వారు సైతం జగపతిబాబును ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు. నాగార్జున అయితే తన సొంత బేనర్‌లో ఈయనతో ‘ఆహా’ అనే చిత్రం చేశాడు. ఈయన ఎంతో మందికి సాయం చేస్తూ వస్తున్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆర్ధికంగా చేయూతనిస్తూ ఉంటారు. దీనివల్లనే ఆయన ఆర్దికంగా చాలా నష్టపోయారు.
ఈ విషయాన్నే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. మొదటి నుంచి కూడా నాకు డబ్బు పిచ్చిలేదు. అందుకే డబ్బుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాను. నాకు తెలిసి కొందరికి విపరీతమైన డబ్బు పిచ్చి ఉంది. వారు మంచి బట్టలేసుకోరు. జీవితాన్ని హ్యాపీగా గడపరు. అలాంటి వారికి ఎన్నో కోట్లున్నా ఏం లాభం? డబ్బు విషయంలో నేను మోసపోయాను. నన్ను ఈజీగా మోసం చేయవచ్చు. అది నా తప్పేనని ఒప్పుకుంటాను. అయితే డబ్బున్నది ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు. అది లేని వారికి సాయపడటానికి కూడా. ఆ ఉద్దేశ్యంతోనే నేను సాయపడ్డానని అనుకుంటూ ఉంటాను. నా కూతురు పెళ్లి సమయానికి నా వద్ద డబ్బు లేదని, అందుకే ఘనంగా చేయలేకపోయాననే బాధ కూడా నాకు లేదు. జీవితమంటే అనుభవాలను పాఠాలుగా నేర్చుకుంటూ వెళ్లడమే.
సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛాన్స్‌లు వస్తాయని ఫోన్ నెంబర్లు పట్టుకుని తిరిగిన రోజులున్నాయి. సినిమా చాన్స్‌కి సంబంధించిన ఫోన్ వస్తే అద్భుతంగా అనిపించేది. అలాంటి నాచేతిలో ప్రస్తుతం 13 సినిమాలున్నాయి. మా నాన్న పెద్ద నిర్మాత. నేను కాదు. అందువల్లన ఓ చిన్ననిర్మాత తన చిన్నచిత్రంలో ఓ పాత్ర చేయమని అడిగితే అందులో తప్పేంలేదని నేను భావిస్తాను. ఒక నిర్మాత అయితే నాకు షూటింగ్‌లో కుర్చీకూడా వేయలేదు. మరో నిర్మాత వారం రోజుల పాటు భోజనం తెప్పించలేదు.. అంటూ తనలోని భావాలను పంచుకున్నాడు.