కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిలు ఒకే చిత్రంలో ఒకేసారి వెండితెరపై కనిపించనున్నారనే విషయం కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. సాధారణంగా ఈ ఇద్దరు సినిమా కథల విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరిస్తారు. అలాంటిది ఒకే చిత్రానికి వీరు ఓకే చెప్పడంతో అంతటా అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో నాగార్జున మంచు విష్ణు, మోహన్‌బాబు, శ్రీకాంత్ వంటి హీరోలతో కలిసి నటించాడు. ఇటీవలే తమిళ స్టార్ కార్తితో 'ఊపిరి'లో దర్శనమిచ్చాడు. సీనియర్ స్టార్స్‌లో ఒక విధంగా చెప్పుకుంటే చిరంజీవి, బాలకృష్ణ మినహా మిగిలిన ఇద్దరు అయిన నాగార్జున, వెంకటేష్‌లు ఇద్దరు మల్టీస్టారర్స్‌కి, ఇతర యంగ్ స్టార్స్‌తో నటించడానికి సుముఖంగా ఉండటంతో ఇలాంటి వైవిధ్య భరితమైన చిత్రాలు భవిష్యత్తులో మరిన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు వెంకటేష్ కూడా కమల్‌హాసన్, మహేష్‌బాబు, రామ్, పవన్‌కళ్యాణ్ వంటి వారితో కలిసి కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కూడా వరుణ్‌తేజ్, నాగచైతన్యలతో కలిసి స్క్రీన్‌షేర్ చేసుకోనున్నాడు. ఇక నాగార్జున, నానిల విషయానికి వస్తే మొదట్లో అందరు ఇది తమిళ విక్రమ్ వేదాకి రీమేక్‌గా భావించారు. కానీ ఈ చిత్రం అసలుసిసలైన తెలుగు కథే అని తెలుస్తోంది. ఇందులో నాగ్ 'దేవ్‌గా, నాని 'దాసు'లా కనిపిస్తూ ఉండటంతో దీనికి 'దేవదాస్' అనే టైటిల్ కూడా బాగా మ్యాచ్ అయింది. 'భలే మంచి రోజు'తో పాటు నలుగురు యంగ్ హీరోలతో 'శమంతకమణి' చిత్రాన్ని తీసిన టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, అశ్వనీదత్ వంటి భారీ నిర్మాత నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రం టీజర్ బాగా ఆకట్టుకుంటోంది. నాగార్జున, నాని మద్యం సేవించడానికి కూర్చున సీన్ ఇందులో కనిపిస్తోంది. 'సోడా కావాలా? వాటర్ కావాలా' అని నాగ్ అడిగే లోపే నాని మద్యం గ్లాస్‌ని ఖాళీ చేయడం, నవ్వు తెప్పిస్తోంది. 'దాసూ..! ఏంటి సంగతి' అని అంటూ నాగ్ అడగడం దానికి నాని 'అ' అంటూ మూతిముడుచుకోవడం కూడా భలే ఉంది. స్మాల్ పెగ్ అని టీం ట్వీట్ చేయడం, దానికి తగ్గట్లుగానే నాగ్, నానిలు మద్యం బాబులుగా కనిపించడం ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచుతోందనేది మాత్రం వాస్తవం.
Advertisement
CJ Advs