సాధారణంగా కుటుంబ సభ్యులను వారి వేడుకలనాడు కలుసుకోవడం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం, అది అన్నాదమ్ములు గానీ తల్లిదండ్రుల దీవెనల కోసం వెళ్లడం అనేవి వ్యక్తిగత విషయాలు. కానీ నేటి రాజకీయాలు, రాజకీయనాయకుల ప్రవర్తన మాత్రం దీనికి భిన్నంగా ఉంటోంది. దాంతో వారు వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాటా.. కలసే ప్రతి వ్యక్తి విషయంలో కూడా రాజకీయ కోణాలు ఇమిడి ఉంటూ ఉండడం, అందునా ప్రతి విషయాన్ని ఇలానే చూసే ప్రతిపక్ష రాజకీయనాయకులు ఉండటం కాలానుగుణంగా ప్రజల మనస్సులోనే కాదు.. మీడియాకు కూడా పని కల్పిస్తున్నాయి.
ఇక పవన్ రాజకీయ పార్టీని పెట్టిన మొదట్లో ఆయన ఇతర రాజకీయ నాయకులకు, వ్యక్తిగత విమర్శలకు, ప్రతి విషయంలోనూ రాజకీయకోణంలో చూస్తూ విమర్శలు చేయడం వంటి వాటికి అతీతంగా అందరు భావించారు. కానీ రాను రాను పవన్ కూడా సామాన్య రాజకీయ నాయకుడిలానే మారుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్‌కి మేము చేసే తప్పులే కనిపిస్తాయా? ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కి తాకట్టు పెట్టిన తన అన్నయ్యలోని లోపాలు ఆయనకు కనిపించవా? చంద్రబాబు తనయుడిగా లోకేష్‌ని విమర్శిస్తున్న ఆయన తన అన్నయ్య చిరుని ఎందుకు ఒక్క విమర్శ కూడా చేయలేకపోతున్నాడు? అనేది పలువురి సందేహాలలో భాగమే.
ఇక తాజాగా పవన్ తన అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తన భార్య అన్నాలెజినోవాతో పాటు కూతురు, కుమారుడితో కలిసి కుటుంబ సమేతంగా చిరుని కలిసిన విషయం కూడా ఇప్పుడు ప్రతిపక్షాలకు ఓ అస్త్రంగా మారింది. పవన్‌కి బర్త్‌డే వేడుకలంటే పడవు. ఆయన వాటికి విలువ ఇవ్వడు. ఇక తన అన్నయ్య కుటుంబ వేడుకలు, సినీ వేడుకలకు కూడా ఆయన వీలైనంత దూరంగా ఉంటూ ఉన్నాడు. మరోవైపు రామ్‌చరణ్ నుంచి ప్రతి ఒక్క మెగాహీరో ఒక్కొక్కరుగా పవన్‌కి మద్దతు ఇస్తున్నారు. తాను తన కుటుంబసభ్యులు సహకారం తీసుకోనని పవన్ చెబుతున్నా సాయం అందిస్తామని మెగాహీరోలే ముందుకు వస్తున్నారు.
ఇక మరోవైపు చిరంజీవి సినిమాలలో బిజీగా ఉన్నాడని, ఎన్నికలకు రెండు నెలల ముందు కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంటాడని కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటల్లో కూడా వాస్తవం కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో చిరు తటస్థంగా ఉన్నప్పటికీ మెగాభిమానులందరు జనసేన వైపే ఉండాలనే విధంగా ఆయన పరోక్ష సంకేతాలను ఇలాంటి కలయికల ద్వారా ఇస్తున్నాడని రాజకీయ విమర్శలకు విశ్లేషిస్తున్నారు. కాబట్టి ఏ కలయిక దేనికి సంకేతమో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడి ఉందని మాత్రం చెప్పవచ్చు.