సినిమాలలో హాస్యం, స్వచ్చమైన కామెడీ అంటే పాత చిత్రాలను గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. ఇక నాడు జంధ్యాల నుంచి రేలంగి నరసింహారావు వరకు కూడా ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించేవారు. కానీ రాను రాను సినిమాలలో హాస్యం పేరుతో చీప్ అంశాలనే కామెడీగా నేటి దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. హాస్యం అంటే ఎవరిని బాధించకుండా, అంగవైకల్యమో, లేక మనుషులలో ఉండే ఒటేసిటీనో, లేదా సన్నగా రివాటుగా ఉండటాన్నో చూపిస్తూ వారితో వెకిలి చేష్టలు చేయించడం ఎప్పుడు నిజమైన హాస్యం అనిపించుకోదు.
ఇక కొంతకాలం తెలంగాణ యాసతో, మరికొంత కాలం రాయలసీమ యాసతో విలనిజం, ఫ్యాక్షనిజం, మరికొన్నిసార్లు ఉత్తరాంద్ర యాస, శ్రీకాకుళం వంటి చోట్ల ఉండే భాషలను వెకిలిగా చూపించి దానినే హాస్యం అని చెప్పడం సరికాదు. ఇక విషయానికి వస్తే తాజాగా తెలంగాణ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల కోసం కృషి చేస్తోన్న కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆమె మాట్లాడుతూ, గతంలో తెలంగాణ యాసని హేళన చేస్తూ సినిమాలు వస్తూ ఉండేవి. దాంతో నేను పెద్దగా సినిమాలు చూసే దానిని కాదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ యాసని, సంస్కృతి, సంప్రదాయాలను కూడా ఉన్నతంగా చూపిస్తూ మంచి చిత్రాలు వస్తున్నాయి. తాజాగా 'గీతగోవిందం' చూశాను. సినిమా ఎంతో బాగుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. సినిమాలను వ్యాపార దృక్పథంతో తీస్తారనే విషయం నిజమే. దానిని కాదనలేం. సినిమాలలో వాడే భాష దర్శకుల, నిర్మాతల అభిరుచి మేరకే ఉంటుందని నాకు తెలుసు. కాబట్టి భాష విషయంలో సినిమాలను తప్పుపట్టలేం అంటూ నిజాన్ని నిజాయితీగా కవిత చెప్పుకొచ్చింది.