పెట్టుబడులు రావాలన్నా, ఇండస్ట్రీలు రావాలన్నా కూడా ఎవ్వరూ ఊరికే ముందుకు రారు. వారికంటే ఏదో ఒక మినహయింపులిస్తూ ఊరిస్తూ ఉంటే గానీ ఎవ్వరూ ఏ పరిశ్రమను స్థాపించరు. ఈ విషయం చంద్రబాబుకి తెలుసు. ముఖ్యంగా సినిమా ఫీల్డ్ హైదరాబాద్‌లోనే స్ధిరపడి, అది రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు వెళ్లిపోవడంతో పాటు పలువురు నిర్మాతలు, స్టూడియో అధినేతలు హైదరాబాద్ నుంచి రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలో సినీ పెద్ద అయిన తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఏపీకి సినీ పరిశ్రమ రావాలన్న ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదని, దాంతో తాము కూడా మౌనంగా ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా ఏపీలో వైజాగ్, అమరావతి, చెన్నైకి కూతవేటు దూరంలో ఉండే నెల్లూరు జిల్లాకి, తమిళనాడుకు బోర్డర్ అయిన తడ, తలకోన, హార్సిలీహిల్స్, అరకు, ఇలా ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.
కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు బాగానే సాయం చేస్తుండటంతో సినిమా వారు హైదరాబాద్ వదిలి వచ్చేందుకు సిద్దంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో సినిమా పరిశ్రమను అభివృద్ది చేసే ఉద్దేశ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నాడు. చిన్నబడ్జెట్ చిత్రాలకు కేంద్రం విధించిన 18శాతం జీఎస్టీలో రాష్ట్ర జీఎస్టీ 9శాతాన్ని మినహాయింపుగా ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా భవిష్యత్తులో ఏపీలో పరిశ్రమ అభివృద్దికి ఊతం అందించే విషయమే.
తాజాగా అమరావతిలో ఏపీ చలన చిత్ర మండలి అభివృద్ది సంస్థ చైర్మన్ అంబికాకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ మినహాయింపు 4కోట్ల లోపు తీసే చిన్న చిత్రాలకు ఇస్తామని, దానికి రాష్ట్రంలోనే పోస్ట్‌ప్రొడక్షన్ చేయాలనే నిబంధన విధించినట్లు ఆయన తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ లెక్కల ఆధారంగా రీఎంబర్స్‌మెంట్ ఇస్తామని, ఏటా ఏపీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే 10 చిత్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తామని, సింగిల్ విండో విధానాన్ని అవలంభిస్తామని చెప్పుకొచ్చాడు. ఈ నిర్ణయం భవిష్యత్లులో పరిశ్రమ ఏపీలో కూడా బలపడేందుకు దోహదపడుతుందని చెప్పవచ్చు.