హీరోయిన్‌గా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ హీరోగా చేసిన మొదటి చిత్రం 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' చిత్రం ద్వారా యార్లగడ్డ సుప్రియ నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత ఆమె అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ బాధ్యతలు, అన్నపూర్ణ బేనర్‌లో రూపొందే చిత్రాల నిర్మాణ బాధ్యతలను చూసుకుంటూ వస్తోంది. మరలా ఇన్నేళ్ల తర్వాత తాజాగా అడవిశేష్ హీరోగా రూపొందిన స్పైథ్రిల్లర్ 'గూఢచారి'లో కీలకమైన పాత్రను చేసింది.
తాజాగా ఆమె మాట్లాడుతూ, అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం' గురించి చెప్పుకొచ్చింది. 'మనం' సినిమా చేయాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లను ప్రారంభించాం. అప్పుడు తాతగారైన ఏయన్నార్‌గారు బాగా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత ఆయనకు ఒంట్లో నలతగా అనిపించింది. అప్పుడు ఆయనను హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. డాక్టర్లు ఆయన్ను పరీక్షించి వెళ్లిన తర్వాత ఏదో బ్యాడ్‌న్యూస్ వినబోతున్నామని నాకు అనిపించింది. అంతలో తాతగారు నన్ను రూమ్ లోపలికి పిలిచారు. 'ఇంకా నాకు ఎన్నిరోజుల షూటింగ్ ఉంది? నేను ఎప్పుడు కూడా ఏ సినిమా చేయకుండా వదల్లేదు. తొందరగా షూటింగ్ పెట్టు అన్నారు. ఆ తరువాత మా పెద్ద మామయ్యని పిలిచి కూడా అదే చెప్పారు. ఆయన కోరిక మేరకు ఇంట్లోనే డబ్బింగ్‌కి ఏర్పాట్లు పూర్తి చేశాం' అని సుప్రియ చెప్పుకొచ్చింది.
ఇక ఏయన్నార్ తన కుమారులు, మనవళ్ల కంటే తల్లి లేని బిడ్డలని సుమంత్‌ని, సుప్రియని ఎంతో ప్రేమగా చూసేవారనే విషయం తెలిసిందే.