జూనియర్ ఎన్టీఆర్ ‘ఆది, సింహాద్రి’ వంటి చిత్రాల ఊపులో ఉన్నప్పుడు ఆయన నటించిన ‘నరసింహుడు’ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్‌ని నమోదు చేసుకుంది. చివరకు ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత చెంగల వెంకట్రావ్ అప్పుల బాధతో భయపడి హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. వాస్తవానికి ఈ చిత్రం నటుడు సాయికుమార్ సోదరుడు రవిశంకర్ అందించిన కథలో కన్నడలో మాలాశ్రీ ప్రధానపాత్రగా వచ్చిన చిత్రం కథని హీరోకి తగ్గట్టుగా మార్చి తీశారు. ఇక ఈ చిత్రం గురించి తాజాగా సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హీరోగా, బి.గోపాల్ దర్శకత్వంలో విజయేంద్రప్రసాద్ అందించిన కథతో ఓ చిత్రం చేయడానికి రంగం సిద్దమైంది. ఆ సినిమాకు కొంత వరకు డైలాగ్స్ రాసి నేను అమెరికా వెళ్లి వచ్చాను. ఈలోగా కథ మారిపోయింది. సాయికుమార్ సోదరుడు రవిశంకర్ కథతో ఆ చిత్రం చేయాలని నిర్ణయించారు. ఆ కథను నాకు వినిపించారు. అదే ‘నరసింహుడు’. అప్పటికే ‘ఆది, సింహాద్రి’ వంటి చిత్రాలు చేసిన ఎన్టీఆర్‌కి ఆ కథ ఎంత వరకు సూట్ అవుతుందని నేను అనుమానం వ్యక్తం చేశాను. దర్శకనిర్మాతలు బాగా ఉంటుంది అని అంటే సరే అన్నాను.
ఫ్లాష్‌బ్యాక్ మొదలవ్వగానే ఎన్టీఆర్, అమీషాపటేల్‌ల లవ్‌స్టోరీ రన్ అవుతుంది. హీరో మూగవాడు కాదు అని తెలుసుకున్న ప్రేక్షకులు ఏదో అద్భుతం ఊహించుకున్నారు. అలాంటప్పుడు లవ్‌స్టోరీని చెప్పడం సరికాదు అని చెప్పాను. అమీషాపటేల్ కోసం చూస్తారని నిర్మాతలు అన్నారు. ఫ్లాష్‌బ్యాక్ మొదలైన గంట వరకు హీరో ఎవరిని ఎందుకు చంపుతున్నాడో అర్ధం కాదు. అందువల్లనే ప్రేక్షకులు ఈ చిత్రంలో లీనం కాలేకపోయారు. సస్పెన్స్, సెంటిమెంట్ రెండు ఒకే ఒరలో ఇమడవు. ఈ సినిమాలో ఆ తప్పు జరిగింది అని చెప్పుకొచ్చాడు. పరుచూరి వారి విశ్లేషణ ఆ చిత్రం చూసిన వారు అక్షరసత్యం అనే ఒప్పుకోవాల్సిందే.