టాలీవుడ్ లో యాంకరింగ్ చేసే యాంకర్స్ అందరిలో ఒక మెట్టు పైనే ఉంటుంది యాంకర్ సుమ. కేరళ అమ్మాయిగా టాలీవుడ్ కొచ్చిన సుమ తెలుగు వాళ్ళు కూడా స్పష్టంగా మాట్లాడలేని తెలుగుని ఎంతో అందంగా అర్ధవంతంగా... స్ఫాంటేనియస్‌గా మాట్లాడుతూ.. యాంకర్ హిస్టరీలోనే తనదైన ముద్రవేసింది. అసలు సుమ కేరళ అమ్మాయంటే ఎవరూ నమ్మరు. అచ్చ తెలుగు అమ్మాయి అంటేనే అందరూ ఇట్టే నమ్మేస్తారు. ఒక షో కి యాంకరింగ్ చెయ్యనివ్వండి.. ఒక ఆడియో లాంచ్ కానివ్వండి, ఒక ప్రెస్ మీట్, ఒక అవార్డు ఫంక్షన్, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి... ఏ ఈవెంట్ అయినా తన మాటకారి తనంతో తన స్టైలిష్ యాంకరింగ్‌తో అదరగొట్టేస్తుంది.
ఇక ఈటీవీ ఛానల్ కి సుమ యాంకరింగ్ అంటే మహా ఇష్టం అందుకే.. ఈటీవీ లో ఏ పెద్ద ప్రోగ్రాం అయినా.. సుమ చేతిలో పడాల్సిందే. క్యాష్ అయినా జీన్స్ అయినా స్వరాభిషేకం అయినా సుమ నే యాంకరింగ్ చెయ్యాలి. ఇక ఈటీవీలో గత 12 ఏళ్లుగా స్టార్ మహిళా ప్రోగ్రాం లో తనదైన యాంకరింగ్ తో మహిళలకు గంటసేపు ఎనలేని ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న సుమ ఈ ప్రోగ్రాంతో... లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. కొంతమంది మహిళలతో గంటసేపు ఆటపాటలతో స్టార్ మహిళతో సుమ మహిళా ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ.. కేవలం తన వాక్చాతుర్యంతో.. సుమ ఎవరికీ ఏ క్షణంలోను బోర్ కొట్టించకుండా అందరిని మెస్మరైజ్ చేసే ఎంటర్టైన్మెంట్ తో అందరి మనసులను కొల్లగొట్టింది.
అయితే గత 12 ఏళ్లుగా స్టార్ మహిళని ఏకచత్రాధిపత్యంగా నడిపిస్తున్న యాంకర్ సుమ ఇప్పుడు స్టార్ మహిళకు బై బై చెప్పేస్తుంది. ఈటీవీ ఛానల్ వారు స్టార్ మహిళను ఆపేస్తున్నట్లుగా సుమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దాదాపుగా మూడు వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న స్టార్ మహిళా ఇక ఈటీవీ ఛానల్ లో రాదు. అయితే ఈ ప్రోగ్రాంని ఆపేస్తున్నట్లు ప్రకటించిన సుమ స్టార్ మహిళా గ్రాండ్ ఫినాలే కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని.. మీమీ అభిప్రాయాల్ని వీడియో రూపంలో పంపితే ప్రసారం చేస్తామని సోషల్ మీడియా ద్వారా చెబుతుంది. మరి స్టార్ మహిళా ద్వారా ఎంతోమంది మహిళలు గేమ్ షోస్ లో ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ స్టార్ మహిళని విజయవంతం చేశారు. ఇప్పడు ఈ ప్రోగ్రాం ఆగిపోవడం మహిళలకు బాధ కలిగించే విషయమే. అయినా తప్పదు.